Leading News Portal in Telugu

Ujjwala Scheme: మహిళలకు గుడ్‌న్యూస్‌ చెప్పిన మోడీ సర్కార్‌.. మరోసారి ఉచితంగా..!


Ujjwala Scheme: కేంద్ర కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.. మరో దఫా మహిళలకు ఉచితంగా వంట గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. అలాగే ఈకోర్ట్‌ మిషన్‌ మోడ్‌ ఫేజ్‌ త్రీకి ఓకే చెప్పింది. ఈ వివరాలను కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్‌ వెల్లడించారు. G20 సమావేశాలు విజయవంతంగా జరగడంతో ప్రధాని మోడీని, దేశ ప్రజలను కేంద్ర కేబినెట్‌ అభినందించింది. మొత్తంగా ఉజ్వల పథకం విస్తరిస్తోంది కేంద్రం.. ఎన్నికల సంవత్సరంలో 75 లక్షల మంది మహిళలు ప్రయోజనం పొందనున్నారు.. ఉచిత LPG గ్యాస్ కనెక్షన్ పొందుతారు. అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ – ఉజ్వల పథకం కింద ఇప్పటి వరకు 9.60 కోట్ల LPG సిలిండర్లు పంపిణీ చేయబడ్డాయి.. ఈ విషయాన్ని ప్రకటించడం సంతోషంగా ఉందని.. మరో 75 లక్ష ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్లు ఇస్తామని వెల్లడించారు.

లోక్‌సభ ఎన్నికలకు ముందు, కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఉజ్వల యోజనను విస్తరించింది. ఈ పథకం కింద మహిళలకు ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. మూడేళ్లలో 75 లక్షల ఎల్‌పీజీ కనెక్షన్లు ఇస్తామని, ఇందుకు మొత్తం రూ.1,650 కోట్లు ఖర్చు అవుతుందని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. దీంతో ఉజ్వల పథకం కింద 10 కోట్ల మందికి పైగా లబ్ధిదారులు ఉండనున్నారు. గత నెలలో ప్రభుత్వం 75 లక్షల కొత్త కనెక్షన్లను ప్రకటించింది. ఇందుకు సంబంధించిన నిధికి ఇప్పుడు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మొత్తాన్ని ప్రభుత్వ రంగ పెట్రోలియం మార్కెటింగ్ కంపెనీలకు విడుదల చేస్తారు. ఉజ్వల పథకాన్ని 2016 మేలో ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ పథకం కింద దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందిన మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇస్తారు. మరోవైపు.. గత నెలలో ప్రభుత్వం డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.200 తగ్గించింది. ఈ కోత తర్వాత, ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్‌పిజి సిలిండర్లను రూ.903కి విక్రయిస్తున్నారు. ఉజ్వల పథకం లబ్ధిదారులు కూడా దాని ప్రయోజనాలను పొందుతున్నారు.