Parliament Special Sessions: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా ఇదే.. బులిటెన్స్ విడుదల చేసిన ఉభయ సభలు..
Parliament Special Sessions: ఈ నెల 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగబోతున్నాయి. మొదటిరోజు పాత పార్లమెంట్ భవనంలోనే సమావేశాలు జరుగుతాయి. 19 మధ్యాహ్నం నుంచి 22 వరకు కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు జరుగుతాయని ప్రచారం జరుగుతోంది. ఇంకోవైపు సమావేశాలపై పార్లమెంట్ ఉభయ సభలు బులిటెన్స్ విడుదల చేశాయి.. “సంవిధాన్ సభ” నుంచి 75 ఏళ్ల పార్లమెంట్ ప్రస్థానంపై చర్చ సాగించనున్నట్టు తన బులెటిన్‌లో పేర్కొంది రాజ్యసభ.. “సాధించిన విజయాలు, అనుభవాలు, జ్ఞాపకాలు, నేర్చుకున్న పాఠాలు” పై చర్చ ఉంటుందని.. ఇతర సభా కార్యక్రమాల తో పాటు ఈ అంశంపై కూడా సెప్టెంబర్ 18వ తేదీన చర్చ సాగుతోందని పేర్కొంది..
మరోవైపు రాజ్యసభ ఆమోదించి లోకసభలో పెండింగ్ లో ఉన్న రెండు బిల్లులు 1) అడ్వకేట్స్ బిల్లు, 2) ది ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు.. రాజ్యసభలో ప్రవేశ పెట్టి, స్టాండింగ్ కమిటీ కి పంపని మరో రెండు బిల్లులు. 1) ది పోస్ట్ ఆఫీస్ బిల్లు, 2) ది ఛీఫ్ ఎలక్షన్ కమిషనర్, అండ్ అదర్ కమిషనర్స్ ( అప్పాయింట్ మెంట్, కండీషన్స్ ఆఫ్ సర్వీస్, అండ్ టెర్మ్ ఆఫ్ ఆఫీస్) బిల్లు ప్రవేశపెట్టనున్నట్టు లోక్‌సభ తన బులెటిన్‌లో పేర్కొంది.. పార్లమెంట్ ఉభయ సభల్లో మొత్తం నాలుగు బిల్లులపై చర్చ సాగబోతోంది.. మొత్తం 4 బిల్లులను లోకసభలో ప్రవేశపెట్ట నుంది ప్రభుత్వం. రెండు బిల్లులకు ఇప్పటికే రాజ్యసభ ఆమోదం తెలిపింది.. మొత్తం నాలుగు బిల్లుల్లో రెండు బిల్లులు ఇంకా రాజ్యసభ ఆమోదం పొందాల్సి ఉంది. ఆ తర్వాత లోకసభ ఆమోదం పొందాల్సి ఉంది. మొత్తంగా 4 బిల్లులను లోకసభ లో ఆమోదించాలి.. అందులో రాజ్యసభ 2 బిల్లులను ఆమోదించాల్సి ఉంటుంది.
ఇక, G20 సమావేశాలు ముగియడంతో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నిర్వహణపై కేంద్రం పూర్తిగా దృష్టి పెట్టింది. 18 నుంచి సమావేశాలు మొదలు కానుండగా.. 17న ఆల్‌పార్టీ ఫ్లోర్ లీడర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసింది కేంద్రం. ఈ మేరకు ఆయా పార్టీల సభా పక్ష నేతలకు సమాచారం పంపించింది. ఇంకోవైపు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాసంలో కొందరు కేంద్రమంత్రులు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా కోసమే సమావేశమైనట్టు ప్రచారం జరుగుతోంది. ఈ మీటింగ్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోపాటు మంత్రులు అనురాగ్ ఠాకూర్, అశ్విని వైష్ణవ్ తదితరులు హాజరయ్యారు.