Leading News Portal in Telugu

MP K Laxman : కేసీఆర్ తీరు నయా నిజాం రాజ్యాన్ని తలపిస్తోంది


కేసీఆర్ సర్కారు తీరు నయా నిజాం రాజ్యాన్ని తలపిస్తోందన్నారు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, ఎంపీ లక్ష్మణ్. ఇవాళ కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌ రెడ్డి ఇందిరాగాంధీ పార్క్‌ వద్ద ప్రారంభించిన 24 గంటల దీక్షను పోలీసుల భగ్నం చేసి అరెస్ట్‌ చేశారు. కిషన్‌ రెడ్డితో పాటు.. బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో.. ఇందిరాపార్క్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అయితే.. అనుమతులతో దీక్ష చేస్తున్న కిషన్‌ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై బీజేపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి.

ఈ నేపథ్యంలో ఎంపీ లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. శాంతియుతంగా ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ధర్నా చేస్తోన్న కేంద్రమంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి పట్ల వ్యవహరించిన తీరు ఖండిస్తున్నామన్నారు. 24 గంటల పాటు ఉపవాస దీక్ష అని చెప్పి పర్మిషన్ తీసుకున్న తర్వాత కూడా ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరు అక్షేపనీయమ్నారు ఎంపీ లక్ష్మణ్‌. కేసీఆర్ సర్కారు నిజ స్వరూపం బీజేపీ ప్రజలకు వివరిస్తున్నది కాబట్టే కేసీఆర్ భయమన్నారు ఎంపీ లక్ష్మణ్‌. బీజేపీ నేతలను, కార్యకర్తలను అరెస్టుల ద్వారా, దీక్షలను భగ్నం చేయడం ద్వారా మా పోరాటాన్ని ఆపలేరని, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ సర్కారుకు బుద్ది చెప్పడం ఖాయమన్నారు ఎంపీ లక్ష్మణ్‌.

ఇదిలా ఉంటే.. దీక్షాస్థలి నుంచి పోలీసులు బలవంతంగా తరలించడంతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఛాతీలో గాయమవడంతోపాటుగా.. చేతులపై, ఛాతీపై, ఒంటిపై అక్కడక్కడ గోళ్లు గీరుకుపోయాయని వైద్యులు తెలిపారు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో పార్టీ కార్యాలయంలో కిషన్ రెడ్డిని పరిశీలించిన వైద్యులు గోళ్లు గీరుకుపోయిన చోట్ల ఆయింట్‌మెంట్ ఇవ్వడంతోపాటుగా.. ఛాతీలో అయిన గాయానికి రేపు ఉదయం ఎక్స్‌రే తీసుకోవాలని సూచించారు. ఇతర పారామీటర్లు బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.