Vinayaka Chavithi 2023: వినాయక చవితి వచ్చేస్తోంది.. వాడ వాడ.. వీధి వీధి, గడప గడప అనే తేడా లేకుండా గణపతి పూజలు ఆచరిస్తుంటారు.. అయితే, వినాయక మండపాలకు అనుమతి విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు విజయవాడ పోలీసులు.. ఈ రోజు మీడియాతో మాట్లాడి డీసీపీ విశాల్ గున్ని.. గణపతి పందిరి పెట్టుకునే వారు కమాండ్ కంట్రోల్ లో ఏర్పాటు చేసిన సింగిల్ విండోలో అనుమతి తీసుకోవాలని తెలిపారు.. ఒకే చోట అనుమతులకు ఏర్పాటు చేశాం.. అన్ని డిపార్ట్‌మెంట్ల నుంచి అధికారులు ఇక్కడే అందుబాటులో ఉంటారని వెల్లడించారు. నిమజ్జనం సెక్యూరిటీ, నిమజ్జనం ప్రదేశాలు, వీఎంసీ చేసే ఏర్పాట్లు తెలిజేయడం జరుగుతుందన్నారు.. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తున్నాం.. లా అండ్ ఆర్డర్ కాపాడటంతో పాటు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండడంపైనే ముఖ్యంగా ఆలోచిస్తాం అన్నారు.. సామాజిక భద్రతకు విఘాతం కలిగించే వారు వచ్చే అవకాశం ఉందని తెలిస్తే అనుమతులు ఇవ్వబోమని స్పష్టం చేశారు డీసీపీ విశాల్ గున్ని.
మరోవైపు.. అగ్రిగోల్డ్ ఛలో విజయవాడ కు ఎలాంటి అనుమతి లేదని తెలిపారు విశాల్ గున్ని.. సెక్షన్ 144, సెక్షన్ 30 అమలులో ఉన్నాయి.. శాంతిభద్రతలకు భంగం కలిగించే ఇలాంటి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వబడదన్నారు.. ప్రజల నిత్య జీవనానికి భంగం కలిగించకూదని అనుమతి ఇవ్వలేదన్న ఆయన.. 4000 మందిని తనిఖీలకి, బందోబస్తుకు ఏర్పాటు చేశాం.. విజయవాడలోకి వచ్చే ప్రతీ వాహనం తనిఖీ చేయబడుతుంది.. అయితే.. ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తే.. సెక్షన్లు 143, 290, 198 కింద పలు కేసులు పెడతాం అని హెచ్చరించారు. బయటివాళ్లు ఆ 500 మందిలో కలిసే అవకాశం ఉందని అనుమతి నిరాకరిస్తున్నట్టు వెల్లడించారు డీసీపీ విశాల్ గున్ని.