Leading News Portal in Telugu

ఏడు దశాబ్దల తరువాత గ్రామానికి సదుపాయం.. కానీ అంతలోనే సీన్ మారిపోయింది


ఆ ఊరు ఇప్పటికే చాలా కష్టాలు పడింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటినా ఎటువంటి సదుపాయాలకు నోచుకోలేదు. కనీసం నిత్యవసరం అయిన నీరు కూడా ఆ గ్రామస్తులకు అందడం లేదు. ఏదో ట్యాంకర్ల ద్వారా నీరు తీసుకొని వచ్చి మూడు రోజులకొకసారి ఇస్తున్నారు. అది కూడా కేవలం 15 లీటర్లు మాత్రమే ఇస్తారు. వాటినే వారు మూడు రోజుల పాటు వాడుకోవాల్సి ఉంటుంది. అంటే రోజుకు కేవలం 5 లీటర్ల నీటిని మాత్రమే కుటుంబం మొత్తం వాడుకోవాల్సి ఉంటుంది. ఇది ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపుర్‌ జిల్లా లహురియాదహ్‌ గ్రామస్థుల పరిస్థితి. వీరి గ్రామం కష్టాలు వింటే ఎలా బతుకుతున్నారో అనిపిస్తుంది కదా.

అందుకే దేవుడి రూపంలో ఆ జిల్లా కలెక్టర్ అన్నేళ్ల నుంచి వారు అనుభవిస్తున్న కష్టాలకు దారి చూపించాడు. ఈ కష్టాలు చూసి స్పందించిన మీర్జాపుర్‌ కలెక్టర్‌ దివ్యా మిత్తల్‌ ఇంటింటికీ తాగునీరు అందించే పథకం ‘జల్‌జీవన్‌ మిషన్‌’ కింద గ్రామంలో మంచి నీటి పైపులు, కుళాయిలు ఏర్పాటు చేయించారు. ఆగస్టు 29న గ్రామంలో కొళాయిలు ఏర్పాటు జరిగింది. అయితే ఇది జరిగిన మూడు రోజులకే జిల్లా కలెక్టర్ బదిలీ అయ్యారు. ఆ తరువాత వారికి నీరు రావడం ఆగిపోయింది. అయితే దీనంతటికి కారణం జల్‌జీవన్‌ మిషన్‌ ప్రారంభోత్సవానికి తమను పిలవకుండా కలెక్టర్‌ ఇష్టారాజ్యంగా వ్యవహరించారని స్థానిక నేతలకు ఆగ్రహం వచ్చింది. వారి తరుపు వారు గ్రామానికి మంచి నీరు వచ్చే పైపులను కట్ చేసేశారు. దీంతో కష్టాలు తీరాయి అనుకుంటే పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చేసింది. ఈ గ్రామం కథ వింటుంటే ఏదో సినిమాలో చూసినట్టు ఉంది కదా. అప్పటి వరకు మిగిలిన గ్రామస్థులతో పాటు మంచినీటి కష్టాలు పడిన స్థానిక నేతలు కూడా ఇలా చేస్తే తమ పరిస్థితి ఏంటి అని ప్రజలు వాపోతున్నారు.