Leading News Portal in Telugu

PAK vs SL: నేడు పాకిస్తాన్, శ్రీలంక మ్యాచ్.. భారత్‌ను ఢీకొట్టేదెవరు?


PAK vs SL Match Asia Cup 2023 Super Fours Today: ఆసియా కప్‌ 2023 సూపర్‌-4లో భాగంగా నేడు కీలక మ్యాచ్ జరగనుంది. పాకిస్థాన్‌, శ్రీలంక నేడు ఢీ కొట్టనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆసియా కప్‌ ఫైనల్లో భారత్‌ను ఢీ కొడుతుంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌‌లో విజయం సాధించి ఫైనల్‌కి చేరాలని ఇరు జట్లు చూస్తున్నాయి. రెండు జట్లకు ‘డూ ఆర్ డై’ అయిన ఈ మ్యాచ్‌కి వర్ఫం ముప్పు కూడా పొంచి ఉండడం గమనార్హం.

బాబర్ అజామ్ నేతృత్వంలోని పాకిస్థాన్‌ ఇప్పటికే తమ ప్లేయింగ్ ఎలెవన్‌ని ప్రకటించింది. పాక్‌కు ఆటగాళ్ల గాయాలు సమస్యగా మారడంతో లంకతో మ్యాచ్‌ కోసం ఏకంగా 5 మార్పులు చేసింది. భారత్‌తో మ్యాచ్‌లో నసీమ్‌ షా, హారిస్‌ రవూఫ్‌, సల్మాన్‌ అఘా గాయపడ్డారు. నసీమ్‌ టోర్నీ మొత్తానికే దూరమవగా.. లంక మ్యాచ్‌‌లో హారిస్‌ రవూఫ్‌ ఆడడం లేదు. ఈ ఇద్దరి స్థానాల్లో జమాన్‌ ఖాన్‌, మహమ్మద్‌ వసీం ఆడుతున్నారు. సల్మాన్‌ స్థానాన్ని షకీల్‌ భర్తీ చేశాడు. ఫకర్‌ జమాన్‌, ఫహీం అష్రఫ్‌ స్థానాల్లో హారిస్‌, నవాజ్‌ బరిలోకి దిగనున్నారు. పాక్ బ్యాటింగ్‌లో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇమాముల్‌, ఆజామ్‌ పైనే పాక్‌ ఆశలు పెట్టుకుంది.

భారత్‌తో పోరులో విజయం కోసం లంక బాగానే పోరాడింది. అదే ఉత్సాహంతో పాక్‌ను ఓడించాలని చూస్తోంది. గాయాలతో హసరంగ, చమీర, లాహిరు కుమార లాంటి స్టార్ ఆటగాళ్ల సేవలను కోల్పోయిన లంక.. బాగానే రాణిస్తోంది. యువ స్పిన్నర్‌ దునిత్‌ వెల్లలాగె భారత బ్యాటర్లను కట్టడి చేయడం లంకకు కలిసొచ్చే అంశం. పతిరన, తీక్షణ, అసలంకతో లంక బౌలింగ్‌ బలంగానే ఉంది. అయితే బ్యాటింగ్‌ విభాగమే పుంజుకోవాల్సి ఉంది. టాప్ ఆర్డర్ రాణిస్తే గాయాలతో సతమతం అవుతున్న పాక్‌ను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు.

తుది జట్లు (అంచనా) (PAK vs SL Playing 11):
పాకిస్థాన్: బాబర్ ఆజామ్ (కెప్టెన్), మహ్మద్ హారీస్, ఇమామ్-ఉల్-హక్, మహ్మద్ రిజ్వాన్ (కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీమ్ జూనియర్, షాహీన్ ఆఫ్రిది, జమాన్ ఖాన్.
శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్ (కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక (కెప్టెన్), దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, మతీషా పతిరనా.