Leading News Portal in Telugu

బీఆర్ఎస్ రహస్య బంధం.. బీజేపీతోనా.. కాంగ్రెస్ తోనా? | brs secret tie up| bjp| congress| liquor| scam| covert| kcr| ktr| uttam


posted on Sep 14, 2023 10:45AM

తెలంగాణ రాజకీయాల్లో ఒక చిత్రమైన చర్చ జరుగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు   అధికార బీఆర్ఎస్ తో రహస్య ఒప్పందం, అక్రమ సంబంధం ఉందని ఒకరిపై ఒకరు ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో అధికార బీఆర్ఎస్ రహస్య మిత్రులెవరు? అనే చర్చ చాలా కాలంగా సాగుతోంది. అలాగే  రేపటి ఎన్నికల్లో జరగరానిది జరిగి  హంగ్ అసెంబ్లీ అనివార్యమై ఏ రెండు పార్టీలు చేతులు కలుపుతాయి? అనే ప్రశ్న కూడా చక్కర్లు కొడుతోంది. 

కాంగ్రెస్, ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మొదలు కాంగ్రెస్ నాయకులు చాలావరకు, బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని, ఆ రెండు పార్టీల మధ్యా లోపాయికారీ ఒప్పందం ఉందనే  ప్రచారాన్ని పెద్ద ఎత్తున సాగిస్తున్నారు. ఆరెండు పార్టీల మధ్య పొత్తు ఉంది కాబట్టే లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవితను అరెస్ట్ చేయలేదని, కాళేశ్వరం అవినీతిపై బీజేపీ కేంద్ర రాష్ట్ర నాయకులు ఆరోపణలు చేయడమే కానీ విచారణ జరగడం లేదని ఆరెండు పార్టీల మధ్య రహస్య పొత్తుకు ఇంతకంటే ఇంకేమి, ఆధారం కావాలని  ప్రశ్నిస్తున్నారు. 

మరో వంక అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన  కోమటి రెడ్డి వెంకట రెడ్డి వంటి సీనియర్ నాయకులు కొందరు రేపు ఎన్నికల అనంతరం అవసరం అయితే, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని బహిరంగంగానే ప్రకటించారు. అంతే కాదు పీసీసి చీఫ్ రేవంత్ రెడ్డి సహా ఆయన వర్గానికి చెందిన కొందరు నాయకులు కాంగ్రెస్ లో కేసీఆర్  కోవర్ట్లులున్నారని బహిరంగంగానే విమర్శలు చేసిన సందర్భాలున్నాయి. జగ్గా రెడ్డి వంటి కొందరు సీనియర్లు ఇదే విషయంగా పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారు. అదే విధంగా పీసీసి మాజీ  చీఫ్, ఎంపీ ఉత్తమ కుమార్ రెడ్డి సైతం కోవర్డ్ కామెంట్స్  పై తీవ్రంగా స్పందించారు. 

అంతే కాదు  రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకుంటే, కాంగ్రెస్ టికెట్ పై గెలిచిన ఎమ్మెల్యేల..ఫిరాయింపులు ఆపలేమని, అది అయ్యే పని కాదని, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బహిరంగంగా అంగీకరించారు. ఒక విధంగా ఆయన ముందుగానే చేతులు ఎత్తేసారు. అంతే కానీ, అధికారంలోకి రాకున్నా  ప్రతిపక్ష పాత్రను సమర్ధవంతంగా నిర్వహిస్తామని చెప్పలేక పోతున్నారు.

అంతకు  మించి  నడుస్తున్న చరిత్రను చూసినా తెలంగాణ రాష్టం ఏర్పడిన అనంతరం జరిగిన రెండు ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో మూడొంతుల మంది, బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అదలా ఉంటే.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసే 25 నుంచి 30 మంది అభ్యర్ధులకు బీఆర్ఎస్ ఆర్థిక సహాయం చేస్తోందని ప్రచారం జరుగుతోంది. టికెట్ కు అప్లై చేసేందుకు, చెల్లించిన రూ.50 వేల ఫీజు మొదలు, టికెట్ కొనుక్కునేందుకు అవసరమైన, సొమ్ములు,ఎన్నికల ఖర్చులు పూర్తిగా భరించడంతో పాటు గెలిచినా, ఓడినా వారి రాజకీయ భవిష్యత్ కు బీఆర్ఎస్ హామీ ఇస్తోందని అంటున్నారు. అలాగే  కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్ధుల మంచి చెడులు, ఆర్థిక అవసరాలు చూసేందుకు  బీఆర్ఎస్ ఒక ప్రత్యేక వ్యవస్థను, యంత్రాంగాన్ని ఏర్పాటు చేసిందని, ఆ బాధ్యతలను కొందరు  కీలక నేతలకు అప్పగించిందని ప్రచారం జరుగుతోంది.

అలాగే అటు నుంచి, బీఆర్ ఎస్ చెన్నూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ చీఫ్ విప్ బాల్కసుమన్, కాంగ్రెస్ లోనూ మన వాళ్ళే ఉన్నారు.  వాళ్ళు మన వాళ్ళే … మనమే కావాలని మన వాళ్ళు కొంత మందిని కాంగ్రెస్ లోకి పంపించాము .. ఆ కాంగ్రెస్ నాయకులు కూడాఎన్నికల తర్వాత మన పార్టీలోకి వస్తారు. గతంలో చెన్నూర్’ నుచి పోటీ చేసిన ఎంపీ వెంకటేష్ మన పార్టీలోకి వచ్చారు.ఇప్పడు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కూడా రేపు మన పార్టీలోకే వస్తారు  అంటూ బహిరంగ ఉపన్యాసమే చేశారు. అలాగే, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కల్వకుట్ల కవిత సైతం కొందరు కాంగ్రెస్ నాయకులను పొగడ్తలతో ముంచెత్తుతున్నట్లు వార్తలొచ్చాయి. 

అంతే కాదు  బీఆర్ఎస్ తన రెండు దశాబ్దాల   ప్రస్థానంలో అన్ని పార్టీలతో పొట్టు పెట్టుకుంది. అందుకు ఒకే ఒక్క మినహయింపు బీజేపీ. ఈ 20 ఏళ్ళు పైబడిన ప్రస్థానంలో బీఆర్ఎస్. ఏ ఒక్క ఎన్నికల్లోనూ బీజేపీతో పొట్టు పెట్టుకోలేదు.

అలాగే రాష్ట్రం ఏర్పడిన అనంతరం కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు సహా  అన్ని పార్టీల ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక్కడ మళ్ళీ ఒకే ఒక్క మినహాయింపు బీజేపీ .. 2014లో  బీజేపీ టికెట్’పై ఐదుగురు ఎమ్మెల్యేలు గెలిచారు, ఒక్కరూ పార్టీ మారలేదు. 2018లో ఒక్కరే గెలిచినా, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో మరో ఇద్దరు తోడైనా .. పార్టీ మారలేదు.   మరో వంక, రాజకీయ విశ్లేషకులు కూడా ఏ విధంగా చూసినా, అవసరం అయితే  బీఆర్ఎస్ , కాంగ్రెస్ తో జట్టు కడుతుందే కానీ, బీజేపీతో కలవదని, అంటున్నారు.