Leading News Portal in Telugu

Chandrababu: చంద్రబాబుతో బాలకృష్ణ, పవన్‌ కళ్యాణ్, లోకేష్ ములాఖత్


Chandrababu: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కామ్‌ కేసులో అరెస్టయ్యి రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో బాలకృష్ణ, పవన్‌ కళ్యాణ్, లోకేష్ ములాఖత్ అయ్యారు. చంద్రబాబును పరామర్శించి, అక్కడి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. దాదాపు 40 నిమిషాల పాటు ములాఖత్ ఉండే అవకాశం ఉంది. ములాఖత్ తర్వాత జైలు దగ్గర ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నేరుగా రాజమండ్రి సెంట్రల్‌ జైలు వద్దకు చేరుకున్నారు. పవన్‌కళ్యాణ్‌ హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి రాజమండ్రికి ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. రాజమండ్రి సెంట్రల్‌ జైలు కంటే ముందు టీడీపీ క్యాంప్ కార్యాలయానికి పవన్‌ కళ్యాణ్ వెళ్లారు. చంద్రబాబు భార్య భువనేశ్వరితో కొద్దిసేపు పవన్‌ కళ్యాణ్‌ చర్చలు జరిపారు. అనంతరం రాజమండ్రి సెంట్రల్‌ జైలు వద్దకు వచ్చారు. ఆరు వాహనాల కాన్వాయ్‌తో పవన్ కళ్యాణ్ జైలు వద్దకు చేరుకోగా.. ఆరు వద్దు, ఒక కారు సరిపోతుందని అధికారులు సూచించారు. పవన్‌ వెంట జైల్లోకి వెళ్లేందుకు జనసేన నాయకుడు కందుల దుర్గేష్‌ ప్రయత్నించగా.. ఇష్టానుసారంగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంపై అధికారుల అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్, బాలకృష్ణ పర్యటన నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద భద్రతను పెంచారు. 300 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రభుత్వాసుపత్రి , ఆర్ట్స్ కాలేజీల వద్ద భారీకేడ్లు ఏర్పాటు చేసి వాహనాలు దారి మళ్లింపు చేపట్టారు. ఎయిర్‌పోర్టు నుంచి సెంట్రల్ జైలు వరకు ప్రధాన జంక్షన్ల వద్ద పోలీసు పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. జనసేన అధినేత పవన్‌ పర్యటన నేపథ్యంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. పవన్ కళ్యాణ్ పర్యటనకు జనసేన నాయకులు రాకుండా పోలీసులు గృహనిర్బంధం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉండడంతో ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. నలుగురికి మించి ఉండకూడదని, ర్యాలీలు, నిరసనలకు అనుమతి నిబంధనలు అమలులో ఉంది. ములాఖత్ తర్వాత నేరుగా రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రత్యేక విమానంలో రాజమండ్రి నుంచి హైదరాబాద్ పవన్ వెళ్లనున్నారు.