Leading News Portal in Telugu

INDIA: ఇండియా కూటమి సంచలన నిర్ణయం.. వారిపై నిషేధం


INDIA Alliance Decided to Boycott Some Anchors and Media Shows: నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ మధ్య నిస్పక్షపాతంగా ఉండాల్సిన మీడియా సంస్థలు కొన్ని ఒక వర్గానికి కొమ్ము కాస్తున్న విషయం తెలిసిందే. అయితే వీటిలో కొన్ని కాంగ్రెస్ కు వ్యతిరేకంగా, బీజేపీకి మద్దతుగా వ్యవహరిస్తున్నాయి. అయితే తమకు వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేసే టీవీ ఛానెళ్లు, యాంకర్లు, టీవీ షోలను బహిష్కరించాలని నిర్ణయించింది ఇండియా సమన్వయ కమిటీ. బాయ్‌కాట్ చేయబోయే యాంకర్లు, షోల జాబితాను విపక్ష నేతలు రెడీ చేయనున్నారు.మీడియాపై ఏర్పాటు చేసిన  సబ్‌గ్రూప్ కమిటీ యాంకర్లు, షోల పేర్లను రూపొందిస్తుందని కోఆర్డినేషన్ కమిటీ తెలిపింది.

ఢిల్లీలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ నివాసంలో నిన్న జరిగిన ఇండియా కోఆర్డినేషన్ కమిటీ తొలి సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రధానంగా మీడియాలోని ఒక వర్గం తమపై పదే పదే విష ప్రచారం చేస్తోందని ఇండియా కూటమి ఆరోపిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు ఎంతో ఆధారణ లభిస్తున్నా  మీడియాలోని ఒక వర్గం తక్కువ కవరేజీ ఇస్తోందని కాంగ్రెస్ చెబుతోంది. సోషల్ మీడియా నుంచి  సైతం జోడో యాత్రకు భారీగా మద్దతు లభించిందని చెబుతున్న కాంగ్రెస్ కానీ పలు ప్రధాన మీడియా సంస్థలు కావాలనే జోడో యాత్రను బహిష్కరించాయని ఆరోపిస్తోంది.

ఇదే విషయాన్ని  రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ కూడా నొక్కి చెప్పారు.  బీజేపీకి వత్తాసు పలుకుతూ రాహుల్ గాంధీ జోడో యాత్ర గురించి ఆ ఛానళ్లు ప్రసారం చేయడం లేదని ఆయన అన్నారు. ఈ కారణంగానే ఒక నెల పాటు టీవీ చర్చలకు తమ అధికార ప్రతినిధులను పంపకూడదని కాంగ్రెస్ నిర్ణయించింది. అన్ని మీడియా ఛానెల్‌లు  తమ షోలలో కాంగ్రెస్ ప్రతినిధులను ఉంచవద్దని అభ్యర్థిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రణదీప్ సూర్జేవాలా ట్విట్టర్‌లో(ఎక్స్) ఓ ట్వీట్ పెట్టారు. ఇక గతంలో అనగా 2019లో కూడా ఒక నెల పాటు టెలివిజన్ షోలను నిషేధించింది కాంగ్రెస్. ఇక నిన్న జరిగిన సమావేశంలో ప్రధానంగా టికెట్ల పంపకం, ఎన్నికల్లో గెలవడానికి ప్రధానంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించారు.