చంద్రబాబు అరెస్టుపై కేసీఆర్ మౌనం..తెలంగాణ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ఆగ్రహం | why kcr Silence on babu arrest| nation| wide| protest| agitation
posted on Sep 14, 2023 1:23PM
తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై రాష్ట్రంలో నిరసన జ్వాలలు రగులుతున్నాయి. మరోవైపు ఈ వ్యవహారంలో తదుపరి ఏం జరగనుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది. ఇప్పటికే ఈ అక్రమ అరెస్టుపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆయనను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని జాతీయ నేతలు సైతం ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫారుక్ అబ్దుల్లా, శిరోమణి అకాళీదళ్ అధ్యక్షుడు, పంజాబ్ మాజీ డిప్యుటీ సీఎం, ఎంపీ సుఖ్‌బీర్ సింగ్ బాదల్, కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి, ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా వంటి సీనియర్ నాయకులు చంద్రబాబు అరెస్టును ఖండించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. ముందు ముందు మరికొందరు జాతీయ స్థాయి నేతలు కూడా చంద్రబాబుకు మద్దతు తెలిపే ఛాన్స్ కనిపిస్తున్నది. అలాగే పలువురు జాతీయ నేతలు చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు రాజమహేంద్రవరం వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన, ప్రకంపనలు సృష్టిస్తున్న చంద్రబాబు అరెస్టుపై సాటి తెలుగు రాష్ట్రం అయిన తెలంగాణ నుండి కూడా వివిధ పార్టీల నేతలు కూడా స్పందిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కొందరు చంద్రబాబు అరెస్టును తప్పుబట్టారు. సీనియర్ నేతలు వీహెచ్ లాంటి వారైతే చంద్రబాబు లాంటి నాయకుడిని అరెస్టు చేయడం ఏపీలో పరిస్థితులకు అద్దం పడుతోందని పేర్కొన్నారు. ఇక తెలంగాణ బీజేపీ అయితే చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చంద్రబాబు అరెస్టుపై తీవ్ర విమర్శలు చేశారు. సుదీర్ఘ కాలం సీఎంగా పనిచేసిన వ్యక్తిని కనీసం నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం ఏమిటని మండిపడ్డారు. మరో తెలంగాణ బీజేపీ నేత, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కూడా చంద్రబాబు అరెస్టును తప్పు బట్టారు. అర్ధరాత్రి వేళ అరెస్టులకు తెగబడడం ఏమిటని ప్రశ్నిచారు. పార్టీలకు అతీతంగా దేశవ్యాప్తంగా చంద్రబాబు అరెస్టుపై నేతలు మండిపడుతున్నారు.
అయితే జాతీయ స్థాయిలో నేతల నుండి చంద్రబాబు అక్రమ అరెస్టుపై స్పందన వస్తున్నా తెలంగాణ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ మాత్రం ఇప్పటి వరకూ పన్నెత్తి మాట్లాడలేదు. స్పందించలేదు. వారి మౌనమే ఇప్పుడు రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన అనంతరం ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ కూడా జాతీయ స్థాయి నేతలే. దేశ రాజకీయాలపై కూడా స్పందించాల్సిన బాధ్యత వీరిపై ఉంది. అందునా ఏపీలో కూడా బీఆర్ఎస్ రాజకీయ కార్యకలాపాలు సాగిస్తున్నది. ఏపీలో బీఆర్ఎస్ క్రీయాశీలంగా ఉందా లేదా అన్నది పక్కన పెడితే.. ఆ రాష్ట్రంలో ఏపీ బీఆర్ఎస్ శాఖఉంది. రాష్ట్ర కార్యాలయం ఉంది. రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఏపీలో ఇంతటి బర్నింగ్ ఇష్యు నడుస్తున్న వేళ, అందునా తెలంగాణ పాలిట కల్పతరువుగా మారిన హైదరాబాద్ నగర అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషించిన చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును బీఆర్ఎస్ నేతలు ఖండించకపోవడం రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది.
చంద్రబాబు అక్రమ అరెస్ట్ ప్రభావం తెలంగాణలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇన్ఫోసిస్ సర్కిల్ లో ఐటీ ఉద్యోగులు పెద్ద ఎత్తున బాబు అరెస్టును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఐయామ్ విత్ బాబు అన్న ప్లకార్డులు పట్టుకుని చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ రోడ్లపైకి వచ్చారు. వారంతా స్వచ్ఛందంగా ఆందోళన బాట పట్టారు. ఇప్పటి దాకా ఉద్యోగులు తమ వేతనాల గురించో, ఇతర సమస్యల గురించే ఆందోళనలకు దిగడం చూశాం. కానీ ఐటీ ఉద్యోగులు తమ జీవితాలలో ఐటీ వెలుగులు నింపిన వ్యక్తి పట్ల కృతజ్ణతతో, ఆయన అక్రమ అరెస్టు పట్ల ఆవేదనతో బయటకు రావడం బహుశా ఇదే మొదటి సారి.
ఇక కూకట్‌పల్లిలో చంద్రబాబు మద్దతుదారులు ఆందోళన చేపట్టారు. చంద్రబాబు అరెస్ట్‌ను కేసీఆర్, కేటీఆర్ ఖండించకపోవడం పట్ల వీరంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అప్రజాస్వామిక అరెస్ట్పై హైదరాబాద్ సెటిలర్స్ భగ్గుమంటున్నారు. చంద్రబాబు అరెస్ట్పై తెలంగాణ పౌరహక్కుల సంఘాలు ఆందోళనలు వ్యక్తం చేశాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో చంద్రబాబు, టీడీపీ అభిమానులు నిరసనల్లో పాల్గొని అటు ఏపీ ప్రభుత్వం, ఇటు బీఆర్ఎస్ నేతలపై కూడా మండిపడుతున్నారు. అయినా కేసీఆర్, కేటీఆర్ నుండి ఎలాంటి స్పందన లేదు. జగన్ మోహన్ రెడ్డితో మైత్రి కారణంగానే కేసీఆర్ అండ్ కో ఈ అంశంపై స్పందించడం లేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. జగన్, కేసీఆర్ ఒక్కటేనని.. ఇద్దరూ చంద్రబాబును ఉమ్మడి శత్రువుగానే చూస్తున్నారని.. అందుకే ఈ అక్రమ అరెస్టును ఖండించడం లేదని రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతుంది.