Aakash Chopra Heap Praise on Kuldeep Yadav: ఆసియా కప్ 2023లో భారత మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అదరగొడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడి 9 వికెట్స్ పడగొట్టాడు. పాకిస్తాన్‌పై బౌలింగ్ చేసే అవకాశం రాకపోగా.. నేపాల్‌పై వికెట్లేమీ పడగొట్టలేదు. సూపర్-4లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్స్ పడగొట్టిన కుల్దీప్.. శ్రీలంకపై 4 వికెట్స్ తీశాడు. సూపర్-4లో భారత్ ఆడిన రెండు మ్యాచ్ విజయాలలో కుల్దీప్ కీలక పాత్ర పోషించాడు. దాంతో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఆసియా కప్ 2023లో అద్భుతంగా ఆడుతున్న కుల్దీప్ యాదవ్‌పై భారత మాజీ క్రికెటర్, స్టార్ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం కుల్దీప్ ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్ అని కొనియడాడు. ‘ప్రస్తుతం కుల్దీప్ యాదవ్ ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్ అని నేను అనుకుంటున్నా. అతడి గణాంకాలు బాగున్నాయి. నిలకడగా వికెట్లు పడగొడుతున్నాడు. కుల్దీప్ ఇటీవల వన్డేల్లో 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఇది సాధారణ విషయం కాదు. 85 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.
‘ఎడమ చేతి వాటంతో మణికట్టును ఉపయోగించి బంతిని స్పిన్ చేయడం కుల్దీప్ యాదవ్ ప్రత్యేకత. చైనామన్ బౌలింగ్ శైలి ప్రత్యేకత ఇదే. శ్రీలంక స్పిన్నర్ అజంతా మెండిస్, ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు రషీద్ ఖాన్ మిస్టరీ స్పిన్నర్లు. అయితే కుల్దీప్ యాదవ్ వారిలా కాదు. కుల్దీప్ సాధారణ లెగ్ స్పిన్, గూగ్లీ బౌలింగ్ చేస్తాడు. దానితోనే బ్యాటర్లను సునాయాసంగా బోల్తా కొట్టిస్తాడు’ అని కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసించాడు. సూపర్-4లో అద్భుత ప్రదర్శన చేసిన యాదవ్‌పై ఫైనల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 2017లో వన్డేల్లోకి అడుగుపెట్టిన కుల్దీప్.. 88 వన్డేల్లో 150 వికెట్లు తీశాడు.