Morocco:తీవ్రమైన కంపనలతో వచ్చిన భూకంపం మొరాకో లో అల్లకల్లోలం సృష్టించిన విషయం అందరికి సుపరిచితమే. ఈ దుర్ఘటనలో వేలమంది ప్రాణాలను కోల్పోయారు. ఈ ఘటనలో గాయపడిన వారిని భూకంపం సంభవించిన ప్రాంతానికి దూరంగా ఉన్న ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రకృతి విపత్తు ఎందరినో నిరాశ్రయులని చేసింది. కుటుంబాలను విచ్చిన్నం చేసింది. తల్లిదండ్రులని కోల్పోయిన పిల్లలు. పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు. శకలాల కింద చిక్కుకున్న మృతదేహాలతో అట్లాస్ పర్వత ప్రాంతం దయనీయంగా మారింది.
కాగా తాజాగా ఈ విషాద ఘటన పైన మొరాకో రాజు కింగ్ మహ్మద్ VI దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు. ఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం భూకంప బాధితులను పరామర్శించారు. తరవాత భూకంపం క్షతగాత్రులు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఈ నేపథ్యంలో ప్రకంపనలో గాయపడిన వారికి అందించబడుతున్న చికిత్స గురించి అలానే ప్రాణాలతో బయటపడిన వారి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు అని ధికారిక MAP వార్తా సంస్థ తెలిపింది. MAP వార్తా సంస్థ మొరాకో రాజు రక్త దానం చేసారని పేర్కొనింది.
ఈ హృదయ విదారక ఘటనలో 2,900 మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. 2,000 మందికి పైగా గాయపడ్డారు. కాగా ఈ ఘటనలో మరణించిన వారు అట్లాస్ పర్వతాలలోని పట్టణాలు మరియు గ్రామాలలోని ప్రజలు. కాగా శతాబ్ద కాలంలో ఇంతటి విపత్తుని చూడడం ఇదే మొదటి సారని అధికారులు పేర్కొన్నారు.