Leading News Portal in Telugu

పొత్తు ఖాయం.. విజయం తథ్యం.. బాబుతో ములాఖత్ అనంతరం పవన్ కల్యాణ్ ప్రకటన | pawan declare alliance with tdp| seat| sharing| bjp| vote| ap| win| babu| jail


posted on Sep 14, 2023 3:07PM

ఇంత కాలం ఏపీలో పొత్తుపొడుపుల విషయంలో ఉన్న సందిగ్ధత, సస్పెన్స్ కు జనసేనాని పవన్ కల్యాణ్ ఫుల్ స్టాప్ పెట్టేశారు. స్కిల్ స్కాంలో అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆయన తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసి భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఆయన జైలు వద్ద మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన కలిసే ఉంటాయని విస్ఫష్టంగా ప్రకటించారు. రెండు పార్టీల మధ్యా పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ పొత్తు తన పార్టీ కోసమో, తెలుగుదేశం పార్టీ కోసమో కాదనీ, రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసమని చెప్పారు. జగన్ రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించడమే లక్ష్యమని పవన్ కల్యాణ్ ప్రకటించారు. 

అసలు రాష్ట్రంలో పొత్తుల గురించిన చర్చను లేవదీసిందే పవన్ కల్యాణ్ అన్న సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవలసి ఉంటుంది. జగన్ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే పవన్  కల్యాణ్ వచ్చే ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల నివ్వనని శపథం చేశారు. ఆయన ఆ ప్రకటన చేసి చాలా కాలమైంది. అప్పటి నుంచీ రాష్ట్రంలో పొత్తులపై ఆసక్తికర చర్చ జరుగుతూనే ఉంది. ఒక దశలో క్షేత్ర స్థాయిలో జనసేన, తెలుగుదేశం పార్టీలు కలిసే ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ పోరాటాలలో పాల్గొన్నాయి. దీంతో రెండు పార్టీల మధ్యా పొత్తు ఖాయమన్న భావనే సర్వత్రా వ్యక్తం అయ్యింది. దీనిపై వైసీపీ పలు మార్లు విమర్శలు గుప్పించింది. దమ్ముంటే ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగాలంటూ.. పవన్ కల్యాణ్ కు సవాళ్లు విసిరింది. సింహం సింగిల్ గా వస్తుంది.. పందులే గుంపులుగా వస్తాయంటూ రజనీకాంత్ సినిమాలోని పంచ్ డైలాగులతో ఎద్దేవా చేసింది. అయినా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను అన్న మాటకే పవన్ కల్యాణ్ కట్టుబడి ఉన్నారు. అదే సమయంలో ఇప్పటికే ఆయన బీజేపీ మిత్రపక్షంగా ఉండటంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తుపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. 2014 ఎన్నికల నాటి పరిస్థితే 2024లోనూ పునరావృతమౌతుందంటూ విశ్లేషణలు సాగాయి.  అయితే తెలుగుదేశం కూటమితో బీజేపీ చేతులు కలుపుతుందా అన్న విషయంపై ఇప్పటికీ క్లారిటీ లేదు. ఆ క్లారిటీ కోసమే ఇప్పటి వరకూ పొత్తుపై ప్రతిష్ఠంభన కొనసాగుతూ వచ్చిందని పరిశీలకులు చెబుతున్నారు. అయితే చంద్రబాబు అరెస్టు తరువాత జనసేనాని వైఖరిలో పూర్తిగా మార్పు వచ్చింది. అరెస్టును ఖండించడం.. హుటాహుటిన బెజవాడ బయలుదేరడం, ఆయన స్పెషల్ ఫ్లైట్ టేకాఫ్ కు అధకారులు అనుమతి నిరాకరించడం, అయినా తగ్గకుండా ముందుకు సాగడం, పోలీసులు అడ్డుకుంటే రోడ్డుపైనే పడుకోవడం ద్వారా అన ఆగ్రహాన్ని ప్రస్ఫుటంగా చాటారు. సరే ఇప్పుడు రాజమహేంద్రవరం జైలులో ములాఖత్ ద్వారా చంద్రబాబును కలిసిన తరువాత బీజేపీ విషయం పక్కన పెట్టేసి జనసేన తెలుగుదేశం పొత్తు గ్యారంటీ అని విస్ఫష్టంగా ప్రకటించేశారు. దీంతో ఇక ఏపీలో  జనసేన తెలుగుదేశంతో కలిసి సాగుతుందన్న విషయం స్పష్టమైపోయింది. ఇక తేలాల్సింది సీట్ల పంపకం. ఇరు పార్టీల మధ్యా గతంలోనే సీట్ల సర్దుబాటుకు సంబంధించి చర్చలు జరిగాయనీ, మూడు నాలుగు స్థానాల విషయంలో ఒకింత ప్రతిష్ఠంభన ఉన్నా దాదాపుగా పాతిక స్థానాల వరకూ జనసేన పోటీ చేస్తుందన్న విషయంలో ఏకాభిప్రాయం కుదిరిందనీ  వార్తలు వచ్చాయి.  ఇక ఇప్పడు బీజేపీ ఏ నిర్ణయం తీసుకుంటుందన్న విషయానికి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. జనసేనాని పొత్తు ప్రకటనతో ఇక బీజేపీకి ఒక వేళ తెలుగుదేశం, బీజేపీ కూటమితో జట్టుకట్టినా  సీట్ల విషయంలో  బార్గెయినింగ్ కెపాసిటీ ఏ మాత్రం ఉండదు. కేంద్రంలో అధికారంలో ఉందన్న ఒకే ఒక్క కారణం తప్పితే.. ఏపీలో ఆ పార్టీకి స్టేక్ లేదు. ఎంతగా లెక్కలు చూసుకున్నా రాష్ట్రంలో ఆ పార్టీకి ఉన్న ఓటు బ్యాంకు ఒక శాతం కంటే తక్కువే. అలాంటి పార్టీ కోసం తెలుగుదేశం, జనసేనలు పాకులాడతాయని భావించజాలం. అలాగే రాష్ట్రంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు పర్యటనలకు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. అలాగే జనసేనాని వారాహి యాత్ర సైతం బ్రహ్మాండంగా విజయవంతం అయ్యిది. ఈ రెండు పార్టీలు కలిసి ఎన్నికల బరిలోకి దిగితే అధికార వైసీపీ పుట్టి మునగడం ఖాయమన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక వేళ బీజేపీ ఈ కూటమిలో చేరినా.. అది ఈ కూటమికి ఏమాత్రం లబ్ధి చేకూర్చదు సరికదా? భారంగా మారినా ఆశ్చర్యపోనవసరం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇక ఇప్పుడు పొత్తు విషయంలో జనసేనాని బీజేపీ విషయం ఎత్తకుండా ప్రకటించేయడంతో రాష్ట్రంలో బీజేపీ ఒక చర్చించాల్సిన పార్టీగా, ఆ పార్టీ ఎటు అన్నది పెద్దగా ప్రాముఖ్యత లేని అంశంగా మారిపోయిందని చెప్పడానికి సందేహం అవసరం లేదు. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన పొత్తులు ఖాయం అన్నది తేలిపోయిన తరువాత చర్చ అంతా ఈ రెండు పార్టీల మధ్యా సీట్ల పంపకం గురించే. అందుతున్న సమాచారం మేరకు ఇప్పటికే జనసేన, తెలుగుదేశం మద్య సీట్ల సర్దుబాటు విషయంలో ఒక ప్రాథమిక అవగాహన కుదిరిందని అంటున్నారు.  2019 ఎన్నికల నాటితో పోలిస్తే ప్రస్తుతం ఏపీలో జనసేన బలం పెరిగిందనడంలో సందేహం లేదు.  ఏ మాటకు ఆమాటే చెప్పుకోవాలి. జనసేన బలం ఎంతగా పెరిగినా ఆ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగితే ఎన్ని సీట్లు సాధించగలుగుతుంది అన్న ప్రశ్నకు సమాధానం చెప్పడం ఇప్పటికీ కష్టమే. ఆ పార్టీ పెరిగిన బలానికి అనుగుణంగా సీట్లు వస్తాయా అన్న విషయంలో పరిశీలకులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జనసేన ఆవిర్భవించి పుష్కర కాలం గడిచినా ఇప్పటికీ ఆ పార్టీ సంస్థాగత నిర్మాణం జరిగిందని చెప్పలేం. అయితే తెలుగుదేశం విషయం అలా కాదు.  ఎన్టీఆర్‌ టీడీపీ స్థాపించినప్పుడు ఆయన తొలి నుంచీ పార్టీ నిర్మాణంపై దృష్టి సారించి  గ్రామ స్థాయి నుంచి నగర స్థాయి వరకూ పార్టీ నిర్మాణం చేపట్టారు. శిక్షణ శిబిరాలు నిర్వహించి, సభ్యత్వాలు నమోదుపైనా దృష్టి సారించారు. ఆ తరువాత పార్టీలో చంద్రబాబు కార్యకర్తల వివరాలు, పార్టీ కార్యక్రమాలను కంప్యూటరైజ్‌ చేశారు. శిక్షణ శిబిరాలను కిందిస్థాయి వరకూ తీసుకువెళ్లారు. ఇప్పుడు ఎన్టీఆర్‌ లేకపోయినా, టీడీపీ సంస్థాగతంగా బలంగా ఉండటానికి అదే కారణం.  అందుకే టీడీపీ అధికారంలో ఉన్నా, లేకపోయినా.. రాజకీయాల్లో తన గుర్తింపు బలంగా చాటుకుని, స్థిరంగా నిలిచింది. ఏపీలో జగన్ పార్టీని ఓడించి అధికారంలోకి రావడానికి అవసరమైన శక్తి, బలం, బలగం ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క తెలుగుదేశం  మాత్రమే.   వైసీపీని ఓడించి, జగన్ రెడ్డి పాలనకు ముగింపు పలకడమే జనసేన లక్ష్యం అన్న పవన్ కళ్యాణ్   తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉందని ప్రకటించి జగన్ ఓటమిని దాదాపు ఖాయం చేసేశారనే చెప్పాలి.

అయితే పొత్తులో భాగంగా జనసేన గౌరవప్రదమైన భాగస్వామ్యం అంటున్నది. అంటే ఎన్ని స్థానాలలో ఆ పార్టీకి పోటీ చేసే అవకాశం దక్కితే గౌరవ ప్రదం అన్న సంశయం అయితే పరిశీలకులలో వ్యక్తం అవుతున్నది. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సీట్ల సర్దుబాటుపై ప్రథమికంగా వచ్చిన అవగాహన మేరకు జనసేన పాతిక నుంచి ముఫ్ఫై సీట్లలో పోటీ చేస్తుందని, సీట్ల పంపకంలో పీటముడి పడకుండా పొత్తుకు ఢోకా లేకుండా ఉండేందుకు ఇరు పార్టీలూ కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందుకు సాగాలని నిర్ణయానికి వచ్చాయని రాజకీయ వర్గాలలో చర్చ సాగుతోంది.  ఇక పాతిక ముప్ఫై స్ధానాలకు జనసేనకు కేటాయించే విధంగా ఇరు పార్టీల మధ్యా అవగాహన కుదిరినట్లేనని కూడా అంటున్నారు.

ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ తెలుగుదేశం గూటికి చేరడం వెనుక కూడా సీట్ల పంపకం విషయంలో ఇరు పార్టీల మధ్యా ఇబ్బందులు తలెత్తకూడదన్న ఉద్దేశంతోనే అని చెబుతున్నారు.   ఇక ఇటీవలి సర్వేలలో కూడా తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు వైసీపీ ఓటమికి రాచబాట పరిచినట్లేనని వెల్లడైన నేపథ్యంలో జనసేనాని పొత్తుపై విస్ఫష్ట ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. జనసేన వాస్తవ బలం ఆధారంగా సీట్ల సర్దుబాటు ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.