Leading News Portal in Telugu

Food Inflation In India: సెప్టెంబర్లో జోరుగా వర్షాలు.. తగ్గనున్న నిత్యావసరాల ధరలు


Food Inflation In India: వేసవిలో తీవ్ర ఎండలు, అకాల వర్షాలు దేశంలో ద్రవ్యోల్బణాన్ని భారీగా పెంచాయి. వాటిలో ప్రధానంగా ఆహార ద్రవ్యోల్బణం వేగంగా పెరిగింది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. వర్షం కారణంగా ఉత్పత్తి తక్కువగా ఉండటం వల్ల భవిష్యత్తులో బియ్యంతో పాటు అనేక వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే సెప్టెంబర్లో కురుస్తున్న వర్షాలు కొంత ఉపశమనం కలిగించే ఆశలు పుట్టిస్తున్నాయి.

సెప్టెంబరులో మెరుగ్గా వర్షాలు కురవడం వల్ల ప్రధాన వ్యవసాయ ప్రాంతాల్లో కొంత సంతోషం వ్యక్తం అవుతోంది. చాలా చోట్ల గతంలో కంటే నాట్లు మెరుగ్గా పడుతున్నాయి. ఈ వర్షం ద్రవ్యోల్బణాన్ని తగ్గించవచ్చని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే వరి, సోయాబీన్‌తో సహా కొన్ని పంటల దిగుబడి మెరుగుపడవచ్చు. ఆగస్టులో వర్షాభావం కారణంగా ధాన్యం ఉత్పత్తి తగ్గింది. సెప్టెంబర్ 8 నాటికి వరిసాగు విస్తీర్ణం ఏడాది ప్రాతిపదికన 2.7 శాతం పెరిగి 40.3 మిలియన్ హెక్టార్లకు చేరుకోగా, సోయాబీన్ విస్తీర్ణం 1.3 శాతం పెరిగి 12.54 మిలియన్ హెక్టార్లకు చేరుకుంది.

దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో ముఖ్యంగా పంజాబ్, హర్యానాలో వరి సాగు నీటిపారుదలపై ఆధారపడి ఉంటుంది. పెద్ద మొత్తంలో బియ్యం ఉత్పత్తి చేసే తూర్పు రాష్ట్రాల్లో సెప్టెంబరులో మంచి వర్షపాతం నమోదైంది. బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్‌లలో వరి నాట్లు ఎక్కువగా ఉన్నాయి. వరి మాదిరిగానే సోయాబీన్ పంటలకు కూడా సెప్టెంబరు వర్షాల సహాయం అందుతుంది. దీంతో సోయా ఆయిల్ ధరలు తగ్గే అవకాశం ఉంది. సెప్టెంబర్ 21 నాటికి దేశంలోని పలు ప్రాంతాల్లో మరింత వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.