AP CM Jagan: ఏపీలో 5 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. విజయనగరం మెడికల్ కాలేజీ ప్రాంగణం నుంచి సీఎం జగన్ వర్చువల్‌గా ప్రారంభించారు. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో మెడికల్ కాలేజీలను సీఎం ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగించారు. ఇవాళ 5 మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తున్నామని.. మళ్లీ 5 కాలేజీలు, వచ్చే ఏడాది మరో 7 మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. మొత్తంగా 17 కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభించబోతున్నామని సీఎం వెల్లడించారు. ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్‌కు ఒక మెడికల్ కాలేజీ ఉండబోతోందని ఆయన తెలిపారు. ఏపీలో మొత్తం 28 మెడికల్ కాలేజీలు ఉండబోతున్నాయని.. ఈ కాలేజీల వల్ల కొత్తగా 2,250 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రాబోతున్నాయని సీఎం పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి ఏపీలో కేవలం 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయని.. ఇప్పుడు మరో 17 మెడికల్ కాలేజీల కోసం రూ.8480 కోట్లు వెచ్చిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో చాలా మంది గొప్ప డాక్టర్లు కావాలన్నారు.
ఇప్పటి వరకు 2185 సీట్లు అందుబాటులో ఉన్నాయని.. కొత్త కాలేజీల రాకతో సీట్ల సంఖ్య 4735కు చేరిందన్నారు. ఈ ఒక్క ఏడాదే 609 సీట్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. గిరిజన ప్రాంతాల్లోనూ కాలేజీలు వస్తున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. రానున్న రోజుల్లో మరో 2737 పీజీ సీట్లు అందుబాటులోకి వస్తాయన్నారు. వెనుకబడిన ప్రాంతాల్లో కూడా మెడికల్ కాలేజీలు వస్తాయన్నారు. ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలను కూడా అభివృద్ధి చేస్తున్నామన్నారు. మరో 18 నర్సింగ్ కాలేజీలు అందుబాటులోకి తెస్తామని, వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని సీఎం తెలిపారు. 10,032 విలేజ్ క్లీనిక్స్ కూడా ఏర్పాటు చేశామన్నారు. గ్రామస్థాయిలో ఆశావర్కర్లతో సేవలు అందిస్తున్నామని సీఎం వెల్లడించారు. ప్రతీ మండలానికి ఒక పీహెచ్‌సీతో పాటు ఊరిలోనే ఉచిత వైద్యం అందించేలా ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన మందులు అందిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. ఆరోగ్యశ్రీ సేవలు 3,255 ప్రొసీజర్స్‌కు విస్తరించామన్నారు. వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేశామన్నారు. గతంతో పోలిస్తే వైద్యానికి భారీగా బడ్జెట్ పెంచామన్నారు. 108, 104 వాహనాల సంఖ్యను పెంచామని ముఖ్యమంత్రి జగన్ చెప్పుకొచ్చారు. పేదవారికి మంచి జరగాలన్నదే మా ఆలోచన అని, ఏ చదువైనా పేదవారికి అందుబాటులో ఉండాలి అని అన్నారు.