Leading News Portal in Telugu

Infosys: టైమ్ వరల్డ్ బెస్ట్ 100 కంపెనీల్లో భారత్ నుంచి ఒక్క ఇన్ఫోసిస్‌కి మాత్రమే చోటు..


Infosys: దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ సత్తా చాటింది. టైమ్ వరల్డ్ టాప్ 100 బెస్ట్ కంపెనీల్లో స్థానం సంపాదించింది. భారత్ నుంచి టాప్ 100లో నిలిచిన ఏకైక కంపెనీగా ఉంది. భారతదేశానికి చెందిన మరో 7 కంపెనీలు టాప్ -750 కంపెనీల జాబితాలో ఉన్నాయి. టైమ్ మ్యాగజైన్, ఆన్ లైన్ డేటా ఫ్లాట్‌ఫాం స్టాటిస్టా ఈ కంపెనీల జాబితాను విడుదల చేసింది. మైక్రోసాఫ్ట్ తొలిస్థానంలో ఉండగా.. తర్వాతి స్థానానాల్లో ఆల్ఫాబెట్(గూగుల్), మెటా(ఫేస్‌బుక్) కంపెనీలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ జాబితాలో ఇన్ఫోసిస్ 64వ స్థానాన్ని దక్కించుకుంది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని చూపిస్తున్న 750 కంపెనీలను జాబితాను టైమ్స్ విడుదల చేసింది. రెవెన్యూ గ్రోత్, ఉద్యోగుల సంతృప్తి, సోషల్ అండ్ కార్పొరేట్ గవర్నెన్స్ మొదలైన అంశాల ఆధారంగా కంపెనీల ర్యాంకింగ్స్ ప్రకటించింది. ఒకప్పుడు ఆర్థిక రంగాన్ని నడిపించిన తయారీ, వినియోగ వస్తువుల కంపెనీలను టెక్ కంపెనీలు, బిజినెస్ సర్వీసెస్ కంపెనీలు నేలకు దించుతున్నాయని టైమ్ పేర్కొంది. ఎయిర్ లైన్స్, హోటళ్లు, మాన్యుపాక్చర్ వంటి కంపెనీలు కార్బన్ ఉద్గారాలను విడుదల చేస్తాయి, కానీ టెక్ కంపెనీల్లో ఇలాంటివి ఉండవని టైమ్ తన వెబ్‌సైట్ లో పేర్కొంది. దీంతో పాటు ఉద్యోగులు ఆనందంగా ఉన్నందుకు ఈ టెక్ కంపెనీలు మంచిర్యాంకులను పొందాయని పేర్కొంది.

ఇన్ఫోసిస్‌తో పాటు మరో 7 భారతీయ కంపెనీలు 750 కంపెనీల టైమ్ జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. విప్రో లిమిటెడ్ 174వ స్థానంలో, మహీంద్రా గ్రూప్ 210వ స్థానంలో, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 248వ స్థానంలో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ 262వ స్థానంలో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 418వ స్థానంలో, WNS గ్లోబల్ సర్వీసెస్ 596వ స్థానంలో, ఐటీసీ లిమిటెడ్ 596వ స్థానంలో నిలిచాయి. ఇదే విధంగా ఇన్ఫోసిస్ ప్రపంచంలోని మొదటి మూడు ప్రొఫెషనల్ సేవల కంపెనీల్లో ఒకటిగా నిలిచింది.