ఈ రోజు సీఎం ప్రారంభించిన 9 మెడికల్ కాలేజీలలో రాష్ట్ర ప్రభుత్వ నిధులు లేవన్నారు బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపురి. ఈ రోజు తొమ్మిది ప్రభుత్వ వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభమయ్యాయి. కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్య కళాశాలలను సీఎం కేసీఆర్ సాక్షాత్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ.. సౌకర్యాలు పూర్తిగా లేవు… నిర్మాణం పూర్తి కాలేదు… ఎన్నికల కోసమే ఈ ప్రారంభోత్సవాలు అని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వ నిధులతోనే మెడికల్ కాలేజ్ ల నిర్మాణం చేశారని ఆయన మండిపడ్డారు. సెంట్రల్ అసిస్టెన్స్ నిధుల నుండి ఈ కాలేజీల నిర్మాణించినట్లు ఆయన వ్యాఖ్యానించారు. 233 కోట్ల 20 లక్షలు ఈ కాలేజీలకు గ్రాంట్ కింద ఇచ్చిందని, డాక్టర్ల సంఖ్య పెంచాలనేది కేంద్ర ప్రభుత్వ పాలసీ అన్నారు ఎంపీ అరవింద్. ఇప్పుడు ఉన్న కాలేజీలలో ఉన్న బోధన సిబ్బంది వివరాలు పై వైట్ పేపర్ విడుదల చేయాలని ఎంపీ అరవింద్ డిమాండ్ చేశారు. ఆస్పత్రిలో మౌలిక వసతులు లేవని, పేషంట్స్ ను ఎలుకలు కోరుకుతున్నాయంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. పిల్లలను ఎత్తుకు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదని కేసీఆర్ ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. కేంద్రం మెడికల్ కళాశాలలకు అనుమతి ఇవ్వలేదని విమర్శించారని.. కేంద్రం అనుమతి ఇవ్వకపోతే 9 మెడికల్ కళాశాలలు ఎలా ప్రారంభించారని నిలదీశారు.