విద్యా సంస్థల్లో అడ్మిషన్ల దగ్గర నుంచి ఆధార్ కార్డ్ వరకు ఇక అన్నింటికీ బర్త్ సర్టిఫికెట్ ఆధారం కానుంది. అన్ని రకాల అవసరాలకూ బర్త్ సర్టిఫికెట్‌ను సింగిల్ డాక్యుమెంట్‌ను తీసుకు వచ్చేందకు కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. స్కూళ్లు, కాలేజీల్లో అడ్మిషన్లు, డ్రైవింగ్ లైసెన్సు, ఆధార్ కార్డ్, ఓటర్ కార్డులకు దరఖాస్తు, మ్యారేజ్ రిజిస్ట్రేషన్‌తో సహా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రకాల పనులకు బర్త్ సర్టిఫికెట్‌ను ముఖ్యమైన ధ్రువీకరణ పత్రంగా ఉపయోగించే ఛాన్స్ ఉంది. ఈ మేరకు సవరించిన కొత్త చట్టం ప్రకారం.. అక్టోబర్ 1 నుంచి అమలులోకి రాబోతోంది. జనన మరణాల నమోదు చట్టం-2023ను పార్లమెంట్ గత వర్షాకాల సమావేశాల్లో ఆమోదించింది.
జనన మరణాల నమోదు చట్టం-2023లోని సెక్షన్ 1 సబ్-సెక్షన్ (2) ద్వారా వచ్చిన రైట్స్ ను ఉపయోగించి.. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబర్ 1 నుంచి దీన్ని అమలు చేయనుంది అని కేంద్ర హోం శాఖ తాజాగా జీవోను జారీ చేసింది. జనన, మరణాల నమోదు సవరణ చట్టం-2023 అమలులోకి వచ్చిన తేదీ లేదా ఆ తర్వాత జన్మించిన వారు పుట్టిన తేదీ, ప్రదేశాన్ని నిరూపించడానికి జనన ధ్రువీకరణ పత్రాన్ని ఒకే పత్రంగా ఉపయోగించడానికి ఈ చట్టం సహాయపడుతుంది. పలు ముఖ్యమైన వాటికి బర్త్ సర్టిఫికెట్ ను ఆధారంగా చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని ఏదైనా చట్టబద్ధమైన లేదా స్వయంప్రతిపత్త సంస్థలో ఉద్యోగ నియామకం కోసం కూడా బర్త్ సర్టిఫికెట్‌ను సింగిల్ డాక్యుమెంట్‌గా సమర్పించవచ్చు అని ఈ చట్టంలో చేర్చారు.
అయితే, ఈ చట్టం ప్రకారం.. నమోదిత జనన, మరణాల జాతీయ డేటాబేస్‌ను నిర్వహించడానికి రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకు అధికారం ఉంటుంది. చీఫ్ రిజిస్ట్రార్లు, రిజిస్ట్రార్లు జనన, మరణ డేటాను జాతీయ డేటాబేస్‌తో పంచుకోవడానికి ఉపయోగిస్తారు. ప్రతి రాష్ట్రం కూడా రాష్ట్ర స్థాయిలో ఇలాంటి డేటాబేస్‌ను నిర్వహించాల్సి ఉండేందుకు ఈ చట్టంలో మార్పులు చేశారు.