India-Pak Cricket: సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టకపోతే ఇండియా-పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ మ్యాచులు జరగవని కేంద్రం క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ శుక్రవారం స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి పాక్ చరమగీతం పాడకుంటే పాకిస్తాన్ తో ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించూడదని బీసీసీఐ ముందే నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. సరిహద్దుల వెంబడి ఉగ్రవాదం, చొరబాట్లు, దాడులు ఆపితే తప్ప ఇరు దేశాల మధ్య క్రికెట్ సాధ్యపడదని ఆయన రాజస్థాన్ ఉదయ్‌పూర్ లో చెప్పారు.
జమ్మూ కాశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు జరుగుతున్న ఎన్కౌంటర్ లో నలుగురు అధికారులు మరణించారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తో క్రికెట్ సంబంధాలను తెంచుకోవాలని పెరుగుతున్న డిమాండ్ మధ్య ఆయన ఈ రోజు ఈ వ్యాఖ్యలు చేశారు. అనంత్‌నాగ్ లో భారతదేశం నలుగురు ధైర్యవంతుల్ని కోల్పోవడంవ దురద్రుష్టకరమని అనురాగ్ ఠాకూర్ అన్నారు. మోడీ ప్రభుత్వం ఉగ్రవాదంపై తీవ్ర చర్యలు తీసుకుంటుందని, దీంతోనే ఉగ్రవాద ఘటనలు తగ్గుముఖం పట్టాయని, ఉగ్రవాదులకు తగిన సమాధానం చెబుతామని అన్నారు.
26/11 దాడులు(2008 ముంబై అటాక్స్) సమయంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మౌన ప్రేక్షుడిగా మిగిలిపోయిందని ఆయన విమర్శించారు. సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలను ఆపితేనే పాకిస్థాన్‌తో సంబంధాలు పెట్టుకుంటామని భారత్ స్పష్టం చేసింది. చివరి సారిగా భారత్- పాకిస్తాన్ 2012-13లో ద్వైపాక్షిక సిరీస్ లో తలపడ్డాయి. ఆ తర్వాత నుంచి ఆసియా కప్, ప్రపంచ కప్ మ్యాచుల్లోనే తలపడుతున్నాయి. చివరి సారిగా భారత క్రికెట్ జట్టు 2006లో పాకిస్తాన్ లో పర్యటించింది. ఈ ఏడాది ఆసియా కప్ పాకిస్తాన్ వేదికగా జరగాల్సి ఉంది. అయితే భారత్ అక్కడికి వెళ్లేది లేదని తేల్చి చెప్పడంతో ఈ సిరీస్ హైబ్రీడ్ మోడ్ లో జరగుతోంది. శ్రీలంక, పాకిస్తాన్ లో కొన్ని మ్యాచులు జరిగాయి. భారత్ తన అన్ని మ్యాచుల్ని శ్రీలంకలో ఆడింది.