పెళ్లి రోజున అరెస్ట్.. భార్య ములాఖత్’కు నో .. భగ్గుమంటున్న మహిళలు | women angry on denying mulakhat to bhuwaneswari| babu| arrest| i|am
posted on Sep 16, 2023 10:48AM
తెలుగుదేశం అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ సృష్టించిన రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఓ వంక రాష్ట్రంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఎక్కడి కక్కడ నిరసనలకు దిగుతుంటే, దేశ విదేశాల్లో ఐటీ, ఇతర రంగాలకు చెందిన ఉద్యోగులు చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటూ ధర్నాలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ తీరు పై మండి పడుతున్నారు. స్కిల్ స్కాంలో చంద్రబాబు ప్రమేయం లేదని నినదిస్తున్నారు.
మరో వంక ఢిల్లీ వెళ్ళిన తెలుగు దేశం పార్టీ, జాతీయ ప్రధాన కార్యదర్శి, నారా లోకేష్ దేశ రాజధాని నుంచి చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవినీతి, అక్రమాలను మీడియా ముందు ఉంచడంతో జాతీయ స్థాయిలోనూ ప్రకంపనలు మొదలయ్యాయి. ఇంతవరకు వివిధ కారణాల వలన చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో కొంత మౌనంగా ఉన్న వివిధ పార్టీల నాయకులు, గళం విప్పుతున్నారు. జగన్ రెడ్డి దుర్మార్గాలను తెలుసుకుని, విస్తుపోతున్నారు.
ఇప్పటికే కేంద్ర మంత్రులు సహా జాతీయ స్థాయి నేతలంతా చంద్రబాబు అరెస్టును ఖండించగా ఇప్పడు తాజగా, బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబును అరెస్ట్ దురదృష్టకరమంటూ ట్వీట్టర్ (x)వేదికగా వ్యాఖ్యానించారు. అంతే కాదు ప్రజల గౌరవాభిమానాలు పొందుతున్న నాయకుడు చంద్రబాబును స్వేచ్ఛను దూరం చేసిన తీరు అంతకంటే బాధాకరం. సుదీర్ఘ రాజకీయ, పరిపాలనా అనుభవం ఉన్న చంద్రబాబు వంటి స్థాయి ఉన్న నాయకునితో వ్యవహరించే టప్పుడు ఆయన స్థాయితో పాటు, వయసును కూడా పరిగణలోకి తీసుకుని అందుకు తగ్గట్టుగా వ్యవహరించాల్సి ఉంటుంది. భిన్నాభిప్రాయాల వ్యక్తీకరణ, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే స్వేచ్ఛ ప్రతి ఒకరికీ ఉండాలని ప్రజాస్వామ్యం చెబుతోంది అని ఆయన వ్యాఖ్యానించారు.
మరోవంక తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రి మాజీ సుజనాచౌదరి,మరో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సహా వివిధ పార్టీలకు చెందిన నాయకులు, చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరును తప్పుపడుతున్నారు. ఆయన వివాహ వార్షికోత్సవం రోజునే ముహూర్తం పెట్టి మరీ మానసిక, శారీరక క్షోభకు గురిచేయడం,అదే విధంగా జైల్లో చంద్రబాబుతో ములాఖత్’కు అయన సతీమణి భువనేశ్వరికి అనుమతించక పోవడం ఏమిటని పార్టీలతో సంబంధం లేకుండా మహిళా నాయకులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఒక మహిళను అది కూడా రాజకీయాలకు దూరంగా ఉన్న మహిళను వేధింపులకు గురిచేసినందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించ వలసి ఉటుందని హెచ్చరిస్తున్నారు.
మరో వంక చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా రాష్ట్రంలో టీడీపీ శ్రేణులు నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో స్వచ్చందంగా పాల్గొంటున్న మహిళలు, చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి ఆయన సతీమణి భువనేశ్వరి,ఇతర కుటుంబ సభ్యులను వేధింపులకు గురిచేయడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చంద్రబాబు అరెస్టు తరువాత జగన్ ప్రభుత్వంపై ప్రజాగ్రహం అగ్నిజ్వాలలా ఎగసి పడుతోంది. ఆయనను గద్దె దించడమే లక్ష్యమని సామాన్య జనం సైతం రోడ్ల మీదకు వచ్చి నినదిస్తున్నారు.