Leading News Portal in Telugu

ఆ ఇద్దరు కలిశారు.. ఇక ప్రభంజనమే! | tdp janasenaalliance defeat fear in ycp| babu| pawan| jagan| cbn| arrest| people| anger


posted on Sep 16, 2023 10:28AM

అవును, లెక్కల్లో ఒకటికి ఒకటి కలిపితే ఖాయంగా అది రెండే..అవుతుంది. అది గణితం. కానీ, రాజకీయ, ఎన్నికల లెక్కల్లో మాత్రం అలాకాదు. సందర్భాన్ని బట్టి లెక్క మారిపోతుంది,. కుడికలు,తీసివేతలు, తీసివేతలు గుణితాలు అవుతాయి.  కొన్ని సందర్భాలలో ఒకటీ, ఒకటీ లెక్కల్లోలానే  రెండు కావచ్చు, ఇకొన్ని సందర్భాలలో  సున్నా కావచ్చు, ఇంకొన్ని సందర్భాలలో ఒకటీ ఒకటీ … రెండు కంటే ఎక్కువ కావచ్చును. ప్లస్ ఇంటూగా మరి రెండు రెండ్లు నాలుగు ఇంకా ఎక్కవ కూడా కావచ్చును. 

అవును  మనం ఇప్పడు మాట్లాడు కుంటున్నది ఆంధ్ర ప్రదేశ్ లో వేగంగా మారుతున్న ఎన్నికల లెక్కలు, రాజకీయ గణితం  గురించే.  ముఖ్యంగా  తెలుగు దేశం అధినేత,రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్, రిమాండ్ అనంతరం చోటు చేసుకుంటున్న పరిణామాలు,మారుతున్న రాజకీయ సమీకరణాల గురించి ఇప్పుడు రాష్ట్రంలోనూ, దేశంలోనే కాదు  విదేశాల్లోనూ తెలుగు వారు  మాట్లాడుకుంటున్నారు. చర్చలు జరుగుతున్నాయి. 

మరీ ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముసుగులో గుద్దులాట లేకుండా, రేపటి ఎన్నికల్లో జనసేన తెలుగు దేశం కలిసి పోటీ చేస్తున్నాయని కుండ బద్దలు కొట్టిన తర్వాత ఏ ఇద్దరు తెలుగు వారు  గ్లోబులో ఎక్కడ కలిసినా ఇదే విషయం చర్చించుకుంటున్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబును కలిసిన అనతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జైలు బయట  జనసేన  తెలుగు దేశం పార్టీలు కలిసే ఎన్నికల బరిలో దిగుతాయని స్పష్టం చేశారు. అంతే కాకుండా  బీజేపీ కూడా కలిసి వస్తుందన్న విశ్వాసం కూడా పవన్ కళ్యాణ్  వ్యక్త పరిచారు. నిజానికి  ఈ ప్రకటన కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఉభయ పార్టీల నాయకులు, కార్యకర్తలు అంటే కంటే ఎక్కువగా వైసీపే పాలనతో విసిగి పోయిన సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్  చేసిన సంచలన ప్రకటన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలుగుదేశం, జనసేన పొత్తుపెట్టుకుంటే, ఇక వైసీపీ ఓటమిని ఆపడం ఎవరి తరం కాదనే భరోసాతో సర్వత్రా సంతోషం వ్యక్తమవుతోంది.  

నిజానికి  ఈ పరిణామాలతో సంబంధం లేకుండానే  రాష్ట్రంలో వైసీపీ వ్యతిరేక పవనాలు ఎప్పుడో జోరందుకున్నాయి. గడప గడపలో ఎదురైన వ్యతిరేకత, సక్సెస్ ఫుల్ గా సాగుతున్న తెలుగు దేశం  జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం  పాద యాత్ర,  చంద్రబాబు జిల్లాల పర్యటనలకు వస్తున్న అద్భుత ప్రజా స్పందన గమనిస్తే, వైసీపీ సర్కార్ కు  రోజులు దగ్గర పడ్డాయనే, నిజం అందరికి అర్థమైంది. అప్పటి నుంచే  ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సహా వైసీపీ నేతల వెన్నులో చలి మొదలైంది. ఆ భయంతోనే జగన్ రెడ్డి దింపుడు కళ్ళెం ఆశతో తప్పుడు కేసులో చంద్రబాబును అక్రమంగా ఇరికించి జైలుకు పంపారు. చంద్రబాబు సీన్ లో లేకుంటే  తెలుగు దేశం పార్టీ కకావికలం అవుతుందని  జగన్ కలలు కన్నారు.  

అయితే తానొకటి తలిస్తే దేవుడు ఇంకొకటి తలచాడు అన్నట్లుగా జగన్ రెడ్డి మాస్టర్  ప్లాన్ బూమ్ రాంగ్ అయింది.  చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఒకటి చేసింది. మరో వంక బీజీపీ ఇంకా నిర్ణయం తీసుకోకున్నా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ  నడ్డా, కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్, మరి కొందరు జాతీయ నాయకులు చేసిన వ్యాఖ్యలు, అలాగే  ఉభయ తెలుగు రాష్ట్రాల బీజేపే అధ్యక్షులు పురందేపురందేశ్వరి, కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీ బండి సంజయ్, డాక్టర్ కే. లక్ష్మణ్ చంద్రబాబు అరెస్ట్ విషయంలో చేసిన వ్యాఖ్యలు గమనిస్తే .. కమలం మనసులో మాట స్పష్టమవుతూనే వుంది.  ఈ అన్నిటి కంటే ముఖ్యంగా ఐదు కోట్ల మంది ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు  చంద్రబాబు  జైల్లో  ఉన్నారనే మాటను జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకే, ఎన్నికలు ఎప్పుడొచ్చినా … వైసీపీ ప్రభుత్వానికి ఉద్వాసన పలకాలనే నిర్ణయానికి  వచ్చారు. ఇప్పడు తెలుగు దేశం, జనసేన పొత్తు ఖరారు కావడంతో .. . జగన్ రెడ్డికి గుడ్ బై చెప్పే సుముహూర్తం  కోసం ఎదురు చూస్తున్నారు.  పొత్తుకు స్వాగతం పలుకుతున్నారు.  అ ఇద్దరు కలిస్తే, ఇక ప్రభంజనమే ..అంటున్నారు . అందుకే, జగన్ రెడ్డి గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. వైసీపీ శ్రేణులు డీలా పడ్డాయి. ఇంకేం చేసినా అధికారం అందని ద్రాక్షేనని వారు అంతర్గత సంభాషణల్లో ఎలాంటి సందేహం లేకుండా చెప్పేస్తున్నారు.