Pipe Line Burst in Visakhapatnam: విశాఖపట్నంలోని హనుమంత వాక దగ్గర వాటర్ పైప్‌లైన్ పగిలి పోవడంతో నీరు ఫౌంటెన్‌లా భారీగా పైకి ఎగిసిన పడుతోంది. పైపుల నాణ్యతలో లోపమో లేదా ఆకతాయిల పనో తెలియదుకానీ, పెద్దమొత్తంలో నీరైతే బయటకు వృథాగా పోయింది. పైప్ లైన్ నుంచి వచ్చే నీరు ఒత్తిడి వల్ల ఉవ్వెత్తున ఎగిసిపడింది. సుమారుగా రెండు, మూడు గంటలుగా మంచినీరు వృథాగా పోతున్నాగానీ జీవీఎంసీ ఇరిగేషన్ అధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదు. పక్కనే ఉన్న రహదారి మొత్తం నీటితో జలమయమైంది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పైప్ లైన్ పగిలిపోవడంతో నీళ్లు మూడంస్తుల బిల్డింగ్ ఎత్తుకు ఎగిసిపడ్డాయి.
ఆ మార్గంలో వెళ్లిన వాహనదారులపై నీరు పడటంతో వారు తడిసిముద్దయ్యారు. వేరే మార్గం లేకపోవడంతో వాహనదారులు తడుచుకుంటూనే వెళ్లారు. ఉవ్వెత్తున్న ఎగిసిపడుతున్న నీళ్లు చూసి స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. నీరంతా వృథాగా పోవడం పట్ల విచారం చెందారు. “అధికారులు దీనిపై చర్యలు తీసుకుని రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి” అని దారిన వేళ్లే ఒక వాహనదారుడు పేర్కొన్నారు. గంటల తరబడి నీళ్లు వృథాగా పోతున్న పట్టించుకొని అధికారుల నిర్లక్యంపై మరికొంత మంది మండిపడుతున్నారు.