Indian Student Death: భారతీయ విద్యార్థి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జాహ్నవి కందుల అమెరికాలో మరణించడం, ఆ తరువాత అక్కడి పోలీస్ అధికారి ఆమె మరణం గురించి హేళన చేస్తూ, చులకనగా మాట్లాడటం ఇటు ఇండియాలో, అటు అమెరికాలో వైరల్ గా మారింది. జనవరి నెలలో పెట్రోలింగ్ చేస్తున్న కారు ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మరణించారు. అయితే పోలీస్ అధికారి ఆమె మరణాన్ని తేలిక చేస్తూ మాట్లాడటం, అతని బాడీ కామ్ కెమెరాలో రికార్డైంది. ఇది ఆ తరువాత వైరల్ గా మారడంతో ఒక్కసారిగా ఈ ఘటన అమెరికాను కదిపేసింది.
తాజాగా జాహ్నవి మరణంపై సియాటెల్ నగర మేయర్ బ్రూస్ హారెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ అధికారి డేనియల్ ఆడెరర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆయన భారత సమాజానికి క్షమాపణ చెప్పారు. ఈ దురదృష్ట సంఘటన, అనుచిత వ్యాఖ్యలతో భారత సమాజం ఏకమైందని, నగర అధికారులు భారత కమ్యూనిటీకి, జాహ్నవి మరణానికి తమ సంతాపాన్ని తెలియజేస్తున్నామని బ్రూస్ హారెల్ తెలిపారు.
ఇదిలా ఉంటే ఇండియన్ కమ్యూనిటీకి చెందిన 20 మంది ప్రముఖులతో సియాటెల్ మేయర్, పోలీస్ చీఫ్ శనివారం సమావేశమయ్యారు. పొరుగువారిని రక్షించే, గౌరవించే సియాటెల్ నగరాన్ని రూపొందిస్తామని వారు హామీ ఇచ్చారు. జాహ్నవి కందులు మరణంపై త్వరితగతిన న్యాయవిచారణ జరిపిస్తామని అమెరికా ప్రభుత్వం భారతదేశానికి హామీ ఇచ్చింది. ఇప్పటికే ఇండియా రాయబార కార్యాలయం ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని అమెరికాను కోరింది.
సియాటెల్ లోని యూనివర్సిటీలో చదువుతున్న జాహ్నవి కందులు జనవరి నెలలో రోడ్డు ప్రమాదానికి గురై మరణించింది. ఆమె మరణం గురించి పోలీస్ అధికారి డేనియల్ ఆడెరల్ మాట్లాడుతూ.. ‘జాహ్నవి సాధారణ వ్యక్తి అని, ఆమె మరణానికి పెద్దగా ప్రాధాన్యత లేదని, నష్టపరిహారం ఇస్తే సరిపోతుందని’ తన సహోద్యోగితో నవ్వుతూ మాట్లాడటం బాడీకామ్ కెమెరాలో రికార్డైంది. ఇది వివాదాస్పదం అయింది.