Leading News Portal in Telugu

Gill-Rohit: అది నేను చేయలేను.. నీకేమైనా పిచ్చి పట్టిందా?! గిల్‌పై రోహిత్ ఫైర్



Gill Rohit Fight

Rohit Sharma’s Conversation With Shubman Gill Ahead of Asia Cup Final: ఆసియా కప్‌ 2023 టైటిల్‌ కోసం శ్రీలంకతో తలపడేందుకు భారత్ సిద్ధమవుతోంది. సూపర్-4లో బంగ్లాదేశ్‌ చేతిలో 6 పరుగుల తేడాతో ఓడినప్పటికీ.. ఫైనల్‌లో రోహిత్ సేన ఫేవరేట్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే శ్రీలంకను కూడా తక్కువగా అంచనా వేయకూడదు. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణిస్తున్న లంకను తక్కువ అంచనా వేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు. ఫైనల్ పోరుకు ముందు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. యువ ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫైర్ (Gill-Rohit Fight) అయ్యాడు.

నెట్టింట వైరల్‌గా మారిన క్లిప్‌లో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఇద్దరూ ఎలివేటర్ ముందు నిల్చొని మాట్లాడుకుంటున్నారు. గిల్ ఏదో అడగడంతో.. రోహిత్ చాలా చికాకుగా బదులిచ్చాడు. ‘అది నేను చేయలేను. నీకేమైనా పిచ్చి పట్టిందా?’ అని రోహిత్ అనడం వీడియోలో స్పష్టంగా వినిపించింది. ఈ వీడియోపై నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ‘భయ్యా.. గిల్ ఏం అడిగి ఉంటాడు’ అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ‘లిఫ్ట్ ఎక్కకుండా మెట్లు ఎక్కుదాం అని గిల్ అంటే.. రోహిత్ తన వల్ల కాదంటున్నాడు’ అని కొందరు ఫాన్స్ జోకులు పేలుస్తున్నారు.

Also Read: SL vs IND: అభిమానులకు శుభవార్త.. కొలంబోలో ‘సూరీడు’ వచ్చేశాడు!

ఇక బంగ్లాదేశ్‌తో మ్యాచులో భారీ మార్పులు చేసిన భారత జట్టు.. ఆసియా కప్ 2023 ఫైనల్‌లో మాత్రం పూర్తి జట్టుతో బరిలో దిగనుంది. బంగ్లాదేశ్‌పై ఆడని విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, మొహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాలు ఫైనల్‌లో బరిలోకి దిగనున్నారు. భారత్ టాప్ ఆర్డర్, బౌలర్లు ఫామ్ మీదున్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌పై సెంచరీ చేరిన శుభ్‌మన్‌ గిల్.. ఫైనల్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడాలని చూస్తున్నాడు. ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మ కూడా మరోసారి మంచి ఆరంభం ఇవ్వాలని చూస్తున్నాడు. గిల్, రోహిత్ చెలరేగితే.. టీమిండియాకు విజయం పెద్ద కష్టమేమి కాదు.