Babar Azam left Sri Lanka for Pakistan after Fires on Shaheen Afridi: పాకిస్తాన్ క్రికెట్‌లో పెను దుమారం రేగినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ తన జట్టు ఆటగాళ్లను డ్రెస్సింగ్ రూంలో ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. తాను మాట్లాడుతుండగా మధ్యలో కలగజేసుకున్న పేసర్ షహీన్ షా అఫ్రిదీతో బాబర్‌కు పెద్ద గొడవ జరిగినట్లు తెలుస్తోంది. చివరకు తన టీంమేట్స్‌కు చెప్పకుండానే బాబర్ శ్రీలంక నుంచి పాకిస్తాన్ వెళ్లిపోయాడట. ఆసియా కప్ ఫైనల్ చేరాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓడడమే ఇందుకు కారణం.
ఆసియా కప్ 2023 సూపర్-4లో భాగంగా భారత్‌పై ఓడిన పాకిస్తాన్.. ఫైనల్ చేరాలంటే శ్రీలంకపై తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించడంతో 42 ఓవర్లుగా అంపైర్లు నిర్ణయించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 42 ఓవర్లలో 7 వికెట్లకు 252 రన్స్ చేసింది. ఆపై వర్షం పడడంతో డక్ వర్త్ లూయిస్ పద్దతిలో లంక లక్ష్యాన్ని 42 ఓవర్లలో 252 పరుగులుగా అంపైర్లు నిర్ణయించారు. సరిగ్గా చివరి బంతికి లంక గెలవడంతో ఫైనల్ చేరింది. ఈ ఓటమితో పాక్ ఇంటిదారి పట్టింది.
చివరి బంతి సమయంలోనే ఎంతో చికాకు పడిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్.. మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూంలో ఆటగాళ్లపై మండిపడ్డాడు. ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా ఆడలేదని బాబర్ ఆటగాళ్లతో అన్నాడు. చెత్త ప్రదర్శనలు చేయొద్దని, ప్రపంచకప్‌లో ఇలా ఆడితే బాగుండదని ఫైర్ అయ్యాడు. బాబర్ మాట్లాడుతుండగా షహీన్ షా అఫ్రిదీ కలగచేసుకుని.. కనీసం బాగా బౌలింగ్, బ్యాటింగ్ చేసిన వారిని అయినా అభినందించాలి కదా అని ప్రశ్నించాడు. దాంతో చిర్రెత్తిన బాబర్.. ఎవరు బాగా ఆడారో తనకు తెలుసు అని అన్నాడు. ఈ క్రమంలో అఫ్రిదీతో బాబర్‌కు గొడవ జరగ్గా.. కీపర్ మహమ్మద్ రిజ్వాన్ కలగజేసుకొని గొడవను అడ్డుకున్నాడు.
ఆటగాళ్ల ప్రదర్శనపై కోపంగా ఉన్న బాబర్ ఆజమ్.. తన టీం మేట్స్‌కు చెప్పకుండానే పాకిస్తాన్ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. టీం మీటింగ్ అనంతరం హోటల్‌కు గదికి వెళ్లిన బాబర్ ఎవరితోనూ మాట్లాడలేదట. ఎవరికీ చెప్పకుండా కొలంబో నుంచి పాక్ బయలుదేరాడట. ప్రపంచకప్ ముందు ఇలా ఆ జట్టులో గొడవలు జరగడం జట్టుకు ఏమాత్రం మంచిది పాక్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. పాక్ ప్రపంచ కప్‌లో రాణించాలంటే అటు షహీన్ అఫ్రిదీ, ఇటు బాబర్ ఆజమ్ జట్టుకు చాలా ముఖ్యం అన్న విషయం తెలిసిందే. ఈ సమస్య ఎక్కడికి వెళుతుందో చూడాలి.