Leading News Portal in Telugu

Asaduddin Owaisi: “థర్డ్ ఫ్రంట్” ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ని కోరా..


Asaduddin Owaisi: దేశంలో థర్డ్ ఫ్రంట్ కు స్థానం ఉందని ఇండియా కూటమిలో భాగస్వామ్యం కాని పార్టీలతో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ కి సూచించినట్లు ఎంఐఏం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. ఇండియా కూటమి దేశంలోని రాజకీయ శూన్యతను పూరించలేకపోయిందని, కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ కి నాయకత్వం వహిస్తే ఇది భర్తీ అవుతుందని ఆయన అన్నారు.

కూటమిలో చేరేందుకు తమకు ఆహ్వానం అందకపోవడాన్ని తాను పట్టించుకోనని చెప్పారు. ఇండియా కూటమిలో సీఎం కేసీఆర్ సహా బీఎస్పీ, ఈశాన్య రాష్ట్రాలు, మహారాష్ట్రకు చెందిన కొన్ని పార్టీలు లేవని తెలిపారు. కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని ఓవైసీ చెప్పడం ఇది తొలిసారి కాదు, కేసీఆర్ నాయకత్వం వహిస్తే దేశంలోని అనేక పార్టీు, నాయకులు సిద్ధంగా ఉన్నారని గత నెలలో ఓవైసీ వ్యాఖ్యానించారు.

అంతకుముందు ఎంఐఎం పార్టీ మహారాష్ట్రకు చెందిన నాయకు వారిస్ పఠాన్ మాట్లాడుతూ.. లౌకికపార్టీలని పిలువబడే పార్టీలు తమను అంటరాని వారిగా చూస్తున్నారని అన్నారు. సెక్యులర్ పార్టీలు మమ్మల్ని పిలవలేదు, మేము వారికి అంటరాని వారిమని, నితీష్ కుమార్, ఉద్ధవ్ ఠాక్రే, మెహబూబా ముఫ్తీలతో సహా పలువురు గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న వారేనని, గుజరాత్ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ కాంగ్రెస్ ని తిట్టడం చూశాము, కానీ వీరంతా బెంగళూర్ లో కలిసి మీటింగ్ జరిపారు అని, 2024లో నిజంగా బీజేపీని ఓడించేందుకు ఎంఐఎం పార్టీ, అసదుద్దీన్ ఓవైసీ కృషి చేస్తున్నారని, అయినా వారు మా పార్టీని విస్మరించారని వారిస్ పఠాన్ అన్నారు.