Leading News Portal in Telugu

PM Vishwakarma scheme: పీఎం మోడీ పుట్టిన రోజు కానుక.. రూ.13,000 కోట్లతో “పీఎం విశ్వకర్మ” పథకం


PM Vishwakarma scheme: ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తన పుట్టిన రోజు కానునగా హస్తకళాకారులకు, చేతివృత్తుల వారికి కొత్త పథకాన్ని ప్రారంభించారు. ‘పీఎం విశ్వకర్మ’ పథకాన్ని ఈ రోజు ప్రారంభించారు. 5 ఏళ్ల కాలానికి దీని కోసం రూ.13,000 కోట్ల నిధులను కేటాయించారు. ఈ పథకం ద్వారా సాంప్రదాయ హస్తకళాకారులకు, చేతివృత్తుల వారికి పూచికత్తు అవసరం లేకుండా, కనీస వడ్డీరేటులో రుణసాయం అందించబడుతుంది. ఈ పథకం ద్వారా చేనేత కార్మికులు, స్వర్ణకారులు, కమ్మరులు, లాండ్రీ కార్మికులు, బార్బర్‌లతో సహా సాంప్రదాయ కళాకారులు, హస్తకళాకారులకు చెందిన 30 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. వీరు అందిచే సేవలు, ఉత్పత్తుల నాణ్యత పెంచే ఉద్దేశంతో ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది.

ఎవరు అర్హులు.. ప్రయోజనాలు ఏంటీ..?

ఈ పథకం కోసం మొదటి విడతగా రూ. 1 లక్ష, రెండో విడతలో రూ.2 లక్షలు హామీ-రహిత ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ లోన్‌లను అందిస్తారు. సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ద్వారా చెల్లించే వడ్డీ రాయితీ పరిమితి 8 శాతంతో లబ్ధిదారుడి నుండి 5 శాతం వడ్డీ రాయితీని వసూలు చేస్తారు. క్రెడిట్ గ్యారెంటీ ఫీజులను కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది.

ఈ పథకం ద్వారా విశ్వకర్మగా గుర్తింపు పొందేందుకు సర్టిఫికేట్, ఐడీ కార్డులు పొందుతారు. 5-7 రోజుల(40 గంటల) ప్రాథమిక శిక్షణ తర్వాత నైపుణ్య ధృవీకరణ వంటి ప్రయోజనాలను కూడా పొందుతారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 15 రోజులు(120 గంటలు) ఆధునాతన శిక్షణ కోసం నమోదు చేసుకోవచ్చు. రోజుకు రూ. 500 స్టైఫండ్ అందించబడుతుంది. అంతేకాకుండా, టూల్‌కిట్ ప్రోత్సాహకంగా రూ. 15,000 గ్రాంట్ అందించబడుతుంది, నెలవారీ ప్రతీ 100 డిజిటల్ లావాదేవీలకి రూ. 1 ప్రోత్సాహకం అందించబడుతుంది.

నేషనల్ కమిటీ ఫర్ మార్కెటింగ్ (NCM) క్వాలిటీ సర్టిఫికేషన్, బ్రాండింగ్, ప్రమోషన్, ఇ-కామర్స్ లింకేజ్, ట్రేడ్ ఫెయిర్స్ అడ్వర్టైజింగ్, పబ్లిసిటీ, ఇతర మార్కెటింగ్ కార్యకలాపాలు వంటి సేవలను అందిస్తుంది. స్వయం ఉపాధి ప్రాతిపదికన అసంఘటిత రంగంలో చేతులు, పనిముట్లతో పనిచేసే, పథకంలో పేర్కొన్న 18మ కుటుంబ ఆధారిత సాంప్రదాయ వ్యాపారాల్లో ఒకదానిలో ఉన్న హస్తకళాకారుడు పీఎం విశ్వకర్మ పథకానికి అర్హుడు. రిజిస్ట్రేషన్ తేదీ నాటికి లబ్ధిదారుడి కనీస వయసు 18 ఏళ్లు ఉంటాలి.