Leading News Portal in Telugu

Mohammed Siraj: చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే ఓవర్‌.. మొహ్మద్ సిరాజ్‌ బుల్లెట్ బంతుల వీడియో!


Mohammad Siraj Historical Over in ODI Cricket: క్రికెట్ ఆటలో కొన్ని రికార్డులు చాలా అరుదుగా నమోదు అవుతుంటాయి. బ్యాటర్ ట్రిపిల్ సెంచరీ చేయడం లేదా డబుల్ సెంచరీ చేయడం.. బౌలర్ 5 వికెట్స్ తీయడం లాంటివి అరుదుగా నమోదవుతుంటాయి. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీయడం కూడా అలాంటిదే. హైదరాబాద్ పేసర్ మొహ్మద్ సిరాజ్‌ ఆ ఘనత సాధించిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయే ఓవర్‌ను ఆసియా కప్ 2023 ఫైనల్లో వేశాడు. ఇన్నింగ్స్‌లో నాలుగో ఓవర్లో ఈ అద్భుతం జరిగింది.

మొహ్మద్ సిరాజ్‌ ఒక్కో బంతిని ఒక్కోలా వేసి బ్యాటర్లను సునాయాసంగా బుట్టలో వేసుకున్నాడు. 1, 3, 4, 6 బంతులకు వికెట్లు పడగొట్టాడు. హ్యాట్రిక్‌ దక్కకపోయినా.. నిప్పులు చెరిగే బంతులు వేశాడు. మొదటి బంతిని ఆఫ్‌స్టంప్‌ ఆవల వేయగా.. కవర్‌డ్రైవ్‌ ఆడేందుకు ప్రయత్నించిన నిశాంక పాయింట్‌లో జడేజాకు చిక్కాడు. మూడో బంతిని లోపలికి స్వింగ్‌ చేసిన సిరాజ్‌.. సమరవిక్రమను వికెట్ల ముందు అవుట్ చేశాడు. ఆ తర్వాత ఫుల్‌ బంతితో అసలంకను ఔట్‌ చేశాడు. బంతిని కట్‌ చేయాలని అసలంక ప్రయత్నించగా.. బంతి ఇషాన్‌ చేతిలో పడింది. ఐదవ బంతికి ధనంజయ డిసిల్వా ఫోర్‌ కొట్టాడు. దూరంగా వెళ్తున్న చివరి బంతిని వెంటాడి డిసిల్వా కీపర్‌కు చిక్కాడు.

మొత్తంగా వన్డేల్లో ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా మొహ్మద్ సిరాజ్‌ నిలిచాడు. శ్రీలంక మాజీ పేసర్ చమిందా వాస్‌ 2003లో బంగ్లాదేశ్‌పై 4 వికెట్స్ పడగొట్టాడు. పాకిస్తాన్ మాజీ పేసర్ మొహమ్మద్‌ సమీ 2003లో న్యూజిలాండ్‌పై 4 వికెట్స్ తీయగా.. ఇంగ్లండ్‌ స్పిన్నర్ ఆదిల్‌ రషీద్‌ 2019లో వెస్టిండీస్‌పై ఈ ఫీట్‌ నమోదు చేశాడు. వన్డేల్లో ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసిన మొదటి భారత బౌలర్ సిరాజ్‌ కావడం విశేషం. సిరాజ్‌ బుల్లెట్ బంతులకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.