Leading News Portal in Telugu

రెండేళ్లుగా నరకం చూపించారు..సీమెన్స్ మాజీ ఎండీ సంచలన వ్యాఖ్యలు! | seemens former md sensational comments| skill| scam| fabricated| case| shell| money| laundering| wrong| project| fact| agreement


posted on Sep 18, 2023 7:23AM

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సంగతి విదితమే. ఆయన అరెస్టును నిరసిస్తూ తెలుగు రాష్ట్రాలలోనూ, దేశ వ్యాప్తంగానే కాదు.. విదేశాలలో కూడా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ రాజకీయనాయకులు, మేధావులూ, న్యాయనిపుణులు గొంతెత్తుతున్నారు. చంద్రబాబుకు రోజురోజుకూ మద్దతు పెరుగుతున్నది. ప్రభుత్వం కక్షపూరిత చర్యలలో భాగంగానే ఈ అక్రమ కేసులు పెట్టినట్లు అన్ని వైపుల నుండి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది.   ఉద్యోగ, ఉపాధి కల్పనలో  యువతకు అవకాశాల కోసం మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు సీమెన్స్‌, డిజైన్‌టెక్‌ అనే సంస్థలతో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం  ఒప్పందం చేసుకుంది. 3 వేల కోట్ల రూపాయల్లో 10 శాతం  ప్రభుత్వం ఇచ్చేలా.. మిగిలిన 90 శాతం సీమెన్స్‌ సంస్థ పెట్టుబడి పెట్టేలా ఒప్పందం చేసుకున్నారు. ఆ పది శాతం సొమ్ము ప్రభుత్వం చెల్లించినట్లుగా చూపించి వెనకేసుకున్నారనేది ప్రభుత్వ అభియోగం. దీనిపై సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ స్పందించారు.

స్కిల్ డెవలప్‌మెంట్‌ సంస్థలో స్కాం జరిగేందుకు అవకాశమే లేదన్న సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్.. ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు నిరాధారమని స్పష్టంచేశారు. ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం అవినీతి ఆరోపణలు చేయడం తనకు ఆశ్చర్యంగా ఉందని.. స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో మనీల్యాండరింగ్ జరగలేదని కుండబద్దలు కొట్టారు. విద్యార్థుల నైపుణ్యాలు మెరుగు పరచడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని వివరించిన ఆయన.. ప్రాజెక్టులో భాగంగా దేశంలో 200కు పైగా ల్యాబ్‌లను ప్రారంభించినట్లు వివరించారు. సిమెన్స్ కంపెనీతో అసలు అగ్రిమెంట్ జరగలేదని సీఐడీ చేస్తున్న ఆరోపణలకు అసలు నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావడం లేదని ఆయన విమర్శించారు. ఏపీఎస్ఎస్డీసీ ప్రభుత్వ సంస్థ కాదా అని ప్రశ్నించిన సుమన్ బోస్.. తప్పుడు ఆరోపణలు చేయడం సులువని, నిరూపించడం సాధ్యం కాదన్నారు. మార్కెటింగ్‌లో భాగంగానే 90:10 ఒప్పందం జరిగిందని.. కోర్టులకు అన్ని వివరాలు చెబుతామని ఆయన వెల్లడించారు.

ఆయన మాటల్లోనే చెప్పాలంటే.. 

‘2014లో రాష్ట్ర విభజన జరిగిన సమయంలో వ్యవసాయ రాష్ట్రంగా ఉన్న ఏపీలో ఐటీ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్ కోసం ముందుకు వచ్చింది. 2021 వరకు స్కిల్ డెవలప్‍మెంట్ ద్వారా 2.32 లక్షల మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు.. వారిలో ఇప్పుడు చాలామంది మంచి ఉద్యోగాలలో స్థిరపడ్డారు. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టును గతంలో ఏపీఎస్ఎస్డీసీ ఎండీ కూడా మెచ్చుకుకున్నారు. అలాంటిది ఇప్పుడు అదే ఏపీఎస్ఎస్డీసీ ఇలాంటి ఆరోపణలు ఎలా చేస్తోందనేది నాకు అర్థం కావడం లేదు. ప్రస్తుతం స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు ఫలితాలు మన కళ్లముందే కనిపిస్తున్నాయి. అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చినపుడు సరైన విచారణ జరిపి కేసు పెట్టాల్సి ఉండగా.. కేసు పెట్టడం కోసమే ఆరోపణలు చేసినట్లు ఉంది. ఒక్క శిక్షణా కేంద్రాన్ని కూడా సందర్శించకుండా ఆరోపణలు నిజమని తేల్చేశారు.

ప్రభుత్వం మోపిన అవినీతి ఆరోపణల కేసు ఎలా ఉందంటే.. ‘విచిత్రంగా హత్యకు గురైనట్లు చెబుతున్న వ్యక్తి బతికే ఉన్నాడు.. బతికుండగానే హత్య జరిగిందని విచారణ చేస్తామంటున్నారు. స్కిల్ డెవలప్‍మెంట్ చాలా విజయవంతమైన ప్రాజెక్టు.. 2016లో కేంద్రం విజయవంతమైన నమూనాగా కూడా ప్రకటించింది. ఇదే తరహా ప్రాజెక్టు చాలా రాష్ట్రాల్లో అమలు చేశాం.. ఇప్పుడు కూడా చేస్తున్నాం. కియా మోటర్స్ సంస్థ కోసం మానవ వనరులకు గొప్పగా శిక్షణ ఇవ్వడంపై ఆ సంస్థ ఆశ్చర్యం కూడా వ్యక్తం చేసింది. ఇప్పటివరకు చేస్తున్న ఆరోపణలకు ఒక్క ఆధారం కూడా చూపలేదు. ఇలాంటి అవాస్తవ ఆరోపణలు చేయడం పలువురి జీవితాలపై ప్రభావం చూపుతుంది. రెండున్నర ఏళ్లుగా ఒక్క సాక్ష్యం చూపించలేకపోయారు. రెండున్నరేళ్లుగా రకరకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ప్రాజెక్టులో భాగంగా దేశంలో ఏర్పాటు చేసిన   ల్యాబ్‌లు కనిపిస్తున్నా.. అగ్రిమెంట్ జరగలేదని ఆరోపించడం దారుణం. ఫలితాలు కళ్ళ ముందు కనిపిస్తున్నా ఇది స్కాంగా కనిపించడం విస్తుగొలుపుతోంది. విస్మయపరుస్తోంది. కోర్టులకు అన్ని వివరాలు చెబుతాం. సీమెన్స్ మాజీ ఎండీ మీడియా ముందుకు వచ్చి చెప్పిన వివరాలతో జగన్ సర్కార్ చంద్రబాబుపై బనాయించిన కేసు పూర్తిగా నిరాధారమైనదని తేటతెల్లమైపోయింది.  చంద్రబాబుపై కక్ష పూరితంగానే, వేధింపు చర్యలలో భాగంగానే ఆయనను అక్రమంగా అరెస్టు చేశారని మేధావులూ, ప్రజలూ చేస్తున్న ఆరోపణలు అక్షర సత్యాలని రుజువైపోయింది.