Leading News Portal in Telugu

Mohammad Siraj: నాకు ఓ మెసేజ్ వచ్చింది.. అందుకే సిరాజ్‌తో 7 ఓవర్లే వేయించా: రోహిత్ శర్మ


Why Mohammed Siraj Bowls Only 7 Overs In Asia Cup 2023 Final vs Sri Lanka: కొలంబోని ప్రేమదాస స్టేడియంలో ఆదివారం శ్రీలంకతో జరిగిన ఆసియా కప్‌ 2023 ఫైనల్‌లో భారత స్టార్‌ బౌలర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ చెలరేగిన విషయం తెలిసిందే. ఒకే ఓవర్లో 4 వికెట్స్ పడగొట్టడంతో పాటు మొత్తంగా ఆరు (6/21) వికెట్స్ తీయడంతో శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఔట్‌, స్వింగ్‌, బౌన్స్ వేసి లంక బ్యాటర్లను బెంబేలెత్తించాడు. కెరీర్‌లోనే అత్యుత్తమ (6/21) బౌలింగ్‌ గణాంకాలను నమోదు చేసిన సిరాజ్‌.. ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. అద్భుత ప్రదర్శన చేసిన సిరాజ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఫైనల్ మ్యాచ్‌లో హైదరాబాద్ పేసర్ మహమ్మద్‌ సిరాజ్‌ 7 ఓవర్లను మాత్రమే వేశాడు. స్పిన్నర్లు, హార్దిక్ పాండ్యాను కెప్టెన్ రోహిత్ శర్మ రంగంలోకి దింపడంతో సిరాజ్‌ మళ్లీ బౌలింగ్ వేసే అవకాశం రాలేదు. ఐతే మిగిలిన ఓవర్లను కూడా వేయించి ఉంటే.. సిరాజ్‌ ఖాతాలో మరికొన్ని వికెట్లు చేరేవాని ఫాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఊపు మీదున్న సిరాజ్‌తో మిగిలిన మూడు ఓవర్లు ఎందుకు వేయించలేదని ఫాన్స్ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. దీనిపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. సిరాజ్‌ 7 ఓవర్ల స్పెల్‌ను నిర్విరామంగా వేశాడని, అతడికి కాస్త విశ్రాంతి ఇవ్వాలని ట్రైయినర్‌ నుంచి తనకు మెసేజ్ (సందేశం) వచ్చిందని తెలిపాడు.

‘భారత పేస్‌ బౌలింగ్‌ను చూసి నేను చాలా సంతోష పడ్డా. ఇలాంటి ప్రదర్శనను ప్రత్యక్షంగా వీక్షించడం ఎంతో అద్భుతం. ప్రతి కెప్టెన్‌కూ ఇలాంటి అనుభవమే కలుగుతుంది కాబట్టి నేను అందుకు భిన్నమేమీ కాదు. భారత జట్టుకు అద్భుత పేస్‌ బౌలింగ్ ఉంది. ప్రతి ఒక్కరిలో విభిన్నమైన బౌలింగ్‌ శైలి, నైపుణ్యాలు ఉన్నాయి. ఒకరు వేగంగా బంతులను వేస్తే.. మరొకరు స్వింగ్‌ చేస్తారు.. ఇంకొకరు బౌన్స్‌ రాబడతారు. ఇలాంటి వారందరూ ఒకే జట్టులో ఉంటే ఆ అనుభూతి వేరే. మొహ్మద్ సిరాజ్‌లో ఇలాంటి లక్షణాలు అన్నీ ఉండటం విశేషం. స్వింగ్‌, పేస్, బౌన్స్ అతడు వేయగలడు’ అని రోహిత్ శర్మ తెలిపాడు.

‘మొహ్మద్ సిరాజ్‌ 7 ఓవర్ల స్పెల్‌లో స్వింగ్‌, పేస్, బౌన్స్ అన్నింటినీ చూశాం. స్లిప్‌లో ఉండి అతడి బౌలింగ్‌ను చూడటం సంతోషంగా ఉంది. సిరాజ్‌ 7 ఓవర్ల స్పెల్‌ను నిర్విరామంగా వేశాడు. దీంతో అతడికి విశ్రాంతి ఇవ్వాలని ట్రైయినర్‌ నుంచి నాకు సందేశం వచ్చింది. అందుకే సిరాజ్‌కు రెస్ట్‌ ఇచ్చి.. మిగతా వారితో బౌలింగ్ కంటిన్యూ చేశా. హార్దిక్‌ పాండ్యా అద్భుతంగా బౌలింగ్‌ చేసి వికెట్లను తీయడంతో సిరాజ్‌కు మళ్లీ అవకాశం రాలేదు. వన్డే ప్రపంచకప్‌ 2023 సమీపిస్తున్న నేపథ్యంలో ఒత్తిడి ఎక్కువ లేకుండా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని రోహిత్ శాత్మ చెప్పాడు.