Gratuity to Annavaram Temple Retired Vrata Priests; ‘వినాయచవితి’ పండగపూట అన్నవరం సత్యదేవుని సన్నిధిలో సేవలందించిన 33 మంది విశ్రాంత వ్రత పురోహితులకు వైఎస్ జగన్ సర్కార్ తీపి కబురు అందించింది. గతంలో ఇద్దరు విశ్రాంత పురోహితులకు చెల్లించినట్టుగానే.. ఈ 33 మందికి వారి సర్వీసును అనుసరించి ఏడాదికి రూ. 10 వేల చొప్పున గ్రాట్యుటీ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో వీరు గరిష్టంగా రూ. 4.5 లక్షలు, కనిష్టంగా రూ. 1.5 లక్షల వరకూ గ్రాట్యుటీ పొందనున్నారు.
అన్నవరం ఆలయంలో ఏటా సుమారు 7 లక్షల వ్రతాలు జరుగుతున్నాయి. ఈ వ్రతాల ద్వారా రూ. 35 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. ఆలయంలో స్పెషల్ గ్రేడ్ పురోహితులు 12 మంది, మొదటి తరగతి పురోహితులు 48 మంది, రెండు మూడు తరగతుల వారు వంద మంది చొప్పున సేవలందిస్తున్నారు. వ్రతాల ఆదాయంలో వీరందరికి దేవస్థానం 40 శాతం పారితోషికంగా చెల్లిస్తోంది. పురోహితులకు వరుసగా నెలకు రూ. 40 వేలు, రూ. 37 వేలు, రూ. 35 వేలు, మూడో తరగతి వారికి రూ. 25 వేల నుంచి రూ. 31 వేల వరకూ చెల్లిస్తున్నారు. వీరంతా 65 సంవత్సరాల తరువాత పదవీ విరమణ చేస్తారు.
గతంలో పురోహితులు ఎన్ని సంవత్సరాలు సేవలందించినా.. వారికి పదవీ విరమణ అనంతరం రూ. లక్ష గ్రాట్యుటీ చెల్లించేవారు. వ్రత పురోహితులు ముత్య సత్యనారాయణ, ప్రయాగ వేంకట రమణలు ఏప్రిల్ మాసంలో పదవీ విరమణ చేశారు. దాదాపు 40 సంవత్సరాల సర్వీసు పూర్తి చేశామని, తమ సర్వీసు ఆధారంగా గ్రాట్యుటీ చెల్లించాలని వారు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. దాంతో ఆ ఇద్దరికి సర్వీసు ఆధారంగా గ్రాట్యుటీ చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గత జూలైలో వారికి రూ. 4.70 లక్షల చొప్పున గ్రాట్యుటీ దక్కింది. ఈ ఉత్తర్వులను 2015 నుంచి 2023 వరకూ పదవీ విరమణ చేసిన వ్రత పురోహితులందరికీ వర్తింపజేయాలని విశ్రాంత పురోహితులు ప్రభుత్వాన్ని కోరారు. వారి కోరిక మేరకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.