Leading News Portal in Telugu

Union Cabinet: సాయంత్రం కేంద్ర కేబినెట్ భేటీ.. కీలక బిల్లులకు ఆమోదం!


Union Cabinet: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సాయంత్రం 6.30 గంటలకు కేంద్ర కేబినెట్‌ ప్రత్యేక సమావేశం జరగనుంది. పార్లమెంట్ భవనంలో కేబినెట్‌ భేటీ కానుంది. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న బిల్లులపై చర్చ జరగనుంది. కొత్త బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఈ ప్రకటన వెలువడింది. పార్లమెంట్ అనుబంధ భవనంలో ఈ సమావేశం జరగనుంది.సమావేశం ఎజెండా ఇంకా వెల్లడి కానప్పటికీ, ప్రత్యేక సమావేశంలో పరిశీలన కోసం జాబితా చేయబడిన కీలక బిల్లులపై చర్చ జరిగే అవకాశం ఉంది.

ఐదు రోజుల ప్రత్యేక సమావేశాల్లో ఎనిమిది బిల్లులపై చర్చ జరుగుతుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. న్యాయవాదుల (సవరణ) బిల్లు 2023, ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు 2023, పోస్టాఫీసు బిల్లు 2023, ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో పాటు ఇతర ఎన్నికల కమిషనర్లు (నియామకం, సేవా నిబంధనలు మరియు పదవీకాలం) బిల్లు 2023, సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి సంబంధించిన బిల్లు, SC/ST ఆర్డర్‌కు సంబంధించిన మూడు బిల్లులపై చర్చ జరగనుంది. దీనికి సంబంధించి అధికారిక ధృవీకరణ లేనప్పటికీ, ప్రభుత్వం ప్రవేశపెట్టవచ్చని అంచనా వేయబడింది. ఈరోజు ప్రారంభమైన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సెప్టెంబరు 22 వరకు కొనసాగనుండగా.. మంగళవారం పార్లమెంటు కొత్త భవనానికి మారనుంది.