Leading News Portal in Telugu

Job Offer: జాబ్ ఆఫర్‌తో ఐఐటీ స్టూడెంట్ కొత్త రికార్డు.. జీతం ఎంతో తెలిస్తే షాకవుతారు!


IIT-Bombay Graduate Sets New Record With Rs 3.7 Crore International Job Offer: ఐఐటీ-బాంబే గ్రాడ్యుయేట్ ఒకరు చరిత్ర సృష్టించారు. ఇటీవల ముగిసిన వార్షిక ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో ఐఐటీ బాంబే గ్రాడ్యుయేట్‌ ఒకరు 3.7 కోట్ల వార్షిక వేతనంతో అంతర్జాతీయ ఉద్యోగ ఆఫర్‌కు ఎంపికయ్యారు. ఇదే ఐఐటీ బాంబే హైయెస్ట్ ఎవర్ ఇంటర్నేషనల్ ఆఫర్ కావడం గమనార్హం. ఇక టాప్ డొమెస్టిక్ శాలరీ (దేశీయంగా ఉద్యోగం) విషయానికి వస్తే అత్యధికంగా ఒకరు ఏడాదికి రూ.1.7 కోట్ల జీతంతో సెలక్ట్ అయ్యారు. ఒక విద్యార్థిని రూ.1.7 కోట్ల ప్యాకేజీతో ఎంపిక అయ్యారు. ఈ ఆఫర్లు పొందిన విద్యార్థుల పేర్లను ఇన్‌స్టిట్యూట్ విడుదల చేయలేదు.

గతేడాదితో పోలిస్తే వేతన ప్యాకేజీలు భారీగా పెరగాయి. ఇంటర్నేషనల్ ఆఫర్‌కు సంబంధించి కిందటేడాది అత్యధికంగా వార్షిక వేతనం రూ.2.1 కోట్లు మాత్రమే కాగా.. ఈసారి 70 శాతం వరకు పెరిగింది. దేశీయంగా అత్యధిక వేతనాలకు సంబంధించి మాత్రం కాస్త తగ్గింది. కిందటేడాది ఐఐటీ గ్రాడ్యుయేట్ దేశీయంగా జాబ్ ఆఫర్లకు సంబంధించి వార్షిక వేతనం అత్యధికంగా రూ.1.8 కోట్లు అందుకోగా.. ఈసారి అది రూ.1.7 కోట్లకు తగ్గింది. ఈ సారి రూ.కోటి కంటే ఎక్కువ వార్షిక వేతనాలతో పదహారు మంది ఐఐటీ-బాంబే విద్యార్థులు ఉద్యోగ ఆఫర్‌లను అంగీకరించారు. మొత్తం 300 ఉద్యోగాలకు గానూ 194 మంది ఆఫర్లను అందుకున్నారు. ఐఐటీ-బాంబేలోని విద్యార్థులు యునైటెడ్ స్టేట్స్, జపాన్, యునైటెడ్ కింగ్‌డమ్, నెదర్లాండ్స్, హాంకాంగ్, తైవాన్‌లలో కార్యాలయాలు ఉన్న సంస్థల నుంచి ఈ సంవత్సరం 65 విదేశీ ఉద్యోగ ఆఫర్‌లను అందుకున్నారు. కిందటేడాదితో పోలిస్తే ఇది కాస్త తక్కువేనని చెప్పొచ్చు. ఇంటర్నేషనల్ ఆఫర్లు ఎక్కువగా అమెరికా, జపాన్, యూకే, నెదర్లాండ్స్, హాంగ్ కాంగ్, తైవాన్ నుంచి ఉన్నాయి. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, ఆర్థిక మాంద్యం సంకేతాలు, ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితుల నడుమ కూడా ఈ స్థాయిలో ప్లేస్‌మెంట్ ఆఫర్స్ రావడం సానుకూల పరిణామమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

జులై 2022 నుంచి జూన్ 2023 వరకు క్యాంపస్ ప్లేస్‌మెంట్ వ్యవధిలో 2,174 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. వారిలో 1,845 మంది ప్లేస్‌మెంట్‌లలో చురుకుగా పాల్గొన్నారు, ఇది ఇప్పటి వరకు అత్యధిక సంఖ్యలో ఉంది. 2021-2022, 2020-2021 ప్లేస్‌మెంట్ సీజన్‌లలో వచ్చిన సగటు ఆఫర్‌లకు భిన్నంగా, ఇవి వరుసగా సంవత్సరానికి రూ.21.50 లక్షలు, రూ.17.91 లక్షలు, 2022-2023 ప్లేస్‌మెంట్ సీజన్‌లో చేసిన సగటు ప్యాకేజీ రూ. 21.82 లక్షలుగా ఉంది.

ఇంజనీరింగ్, టెక్నాలజీ రంగం గరిష్ట సంఖ్యలో ప్లేస్‌మెంట్‌లను చూసింది. వాటిలో 458 మంది 97 కీలక ఇంజనీరింగ్ కంపెనీలలో ఎంట్రీ-లెవల్ స్థానాలను పొందారు. గతేడాదితో పోలిస్తే ఈ సీజన్‌లో ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌ విభాగాల్లో తక్కువ మంది విద్యార్థులను తీసుకున్నారు. అయితే 302 మంది విద్యార్థులు ఐటీ/సాఫ్ట్‌వేర్ రంగంలోని 88కి పైగా కంపెనీల నుండి జాబ్ ఆఫర్‌లను పొందారు. ట్రేడింగ్, ఫైనాన్స్, ఫిన్‌టెక్ కంపెనీలు ప్రధాన రిక్రూటర్‌లుగా ఉన్నాయి. ఈ సంవత్సరం 32 ఆర్థిక సేవా సంస్థల నుంచి 76 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్, మొబిలిటీ, డేటా సైన్స్, ఎనలిటిక్స్, ఎడ్యుకేషన్‌లో పాత్రలు ఎక్కువగా డిమాండ్ చేయబడ్డాయి. మొత్తంగా 2022-23 ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో చురుకుగా పాల్గొన్న 82 శాతం మంది విద్యార్థులు విజయవంతంగా ఉద్యోగాలు సాధించగలిగారు. బిటెక్, డ్యూయల్ డిగ్రీ, ఎంటెక్ ప్రోగ్రామ్‌ల నుంచి దాదాపు 90 శాతం మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు.

Iit Job