Ajit Agarkar explains why senior players are resting for Australia ODIs: సెప్టెంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్ కోసం సోమవారం బీసీసీఐ భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ప్రకటించింది. అనూహ్యంగా భారత జట్టులోకి వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రాగా.. స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాకు రెండు మ్యాచ్‌లకు సెలెక్టర్లు విశ్రాంతిని ఇచ్చారు. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను కూడా తొలి రెండు వన్డేలకు ఎంపిక చేయలేదు. ఈ నలుగురు మూడో వన్డే మ్యాచ్‌కు అందుబాటులో ఉంటారు.
వన్డే ప్రపంచకప్ 2023 సమీపిస్తున్న నేపథ్యంలో స్టార్ ప్లేయర్లను ఆడించకుండా.. విశ్రాంతి ఇవ్వడం ఏంటని? అందరూ భావిసున్నారు. ఇదే ప్రశ్నను బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌ను ఓ జర్నలిస్ట్ అడిగారు. ఈ ప్రశ్నపై అగార్కర్ సమాధానం ఇస్తూ… ‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా మాకు చాలా కీలకం. వారికి తగినంత విశ్రాంతి అవసరం. ఆసియా కప్ 2023లో వారికి మంచి ప్రాక్టీస్ దొరికింది. కుల్దీప్ యాదవ్ కూడా ఫామ్‌లోనే ఉన్నాడు. అందుకే వారికి విశ్రాంతి ఇచ్చి.. జట్టులోని మిగతా ఆటగాళ్లకు అవకాశం ఇచ్చాం’ అని తెలిపాడు.
‘ఇప్పుడు కీలక ఆటగాళ్లకు విశ్రాంతిని ఇవ్వకపోతే సుదీర్ఘంగా జరగనున్న ప్రపంచకప్‌లో ఏదొక దశకు చేరుకున్నాక.. మానసికంగా లేదా శారీరకంగా అలసిపోతారు. అప్పుడు స్టార్ ప్లేయర్లను పక్కన పెట్టడం చాలా ఇబ్బందిగా మారుతుంది. బ్రేక్ ఇవ్వడం వల్ల తాజాగా మెగా టోర్నీకి సన్నద్ధమయ్యేందుకు అవకాశం ఉంటుంది.ఆస్ట్రేలియాతో జరిగే మూడో వన్డేలో ప్రపంచకప్ బరిలోకి దిగే జట్టు ఆడనుంది. తొలి రెండు మ్యాచుల్లో రిజర్వ్ బెంచ్‌పై ఉన్న ఆటగాళ్లకు అవకాశం ఇచ్చాం’ అని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా సిరీస్ అనంతరం స్వదేశంలో జరిగే మెగా టోర్నీకి భారత్ ప్రాక్టీస్ చేయనుంది.