AP CM YS Jagan Today Schedule: తిరుమల శ్రీవారిని ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ దర్శన సమయంలో సీఎం జగన్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు సీఎంకు మహాద్వారం వద్ద స్వాగతం పలికి.. దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు అశీర్వచనం చేసి స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు. శ్రీవారి దర్శనం ముగించుకుని పద్మావతి అతిథి గృహానికి సీఎం వెళ్లారు.
దర్శన సమయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ వెంట డిప్యూటీ సీఎంలు నారాయణ స్వామి, కొట్టు సత్యనారాయణ.. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా.. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ భరత్, ఈవో ధర్నా రెడ్డిలు ఉన్నారు. తిరుమల పర్యటన ముగించుకున్న సీఎం.. రేణిగుంట విమానశ్రయం ద్వారా కర్నూల్ వెళ్లనున్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో తొలిరోజైన సోమవారం రాత్రి సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
నేడు కర్నూల్, నంద్యాల జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. లక్కసాగరంలో హంద్రీనీవా ఎత్తిపోతలను సీఎం ప్రారంభిస్తారు. తాగు, సాగునీరు అందించే పథకాలను కూడా సీఎం జగన్ ప్రారంభించనున్నారు. నంద్యాల జిల్లా డోన్‌లో బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు. సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో సీపీఐ నేతలను ముందస్తు అరెస్టు చేశారు. ఈ అరెస్టులను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఖండించారు.