Leading News Portal in Telugu

ODI WC 2023: ఆసియా కప్ ఎఫెక్ట్.. పాకిస్తాన్ జట్టులో కీలక ఆటగాళ్లకు విశ్రాంతి..!


ఆసియా కప్ 2023లో పాకిస్థాన్ జట్టు పేలవమైన ప్రదర్శన చూపించడంతో ఆ ఆటగాళ్లు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆసియా కప్ లో శ్రీలంక చేతిలో ఓడిపోవడంతో ఫైనల్ చేరుకోలేదు. దీంతో ఇప్పుడు వన్డే ప్రపంచకప్‌లో భారీ మార్పులు చేయనున్నట్లు సమాచారం. మరోవైపు ఇప్పటికే వన్డే వరల్డ్ కప్ కోసం పాకిస్థాన్ జట్టును ప్రకటించింది. ఇదిలా ఉంటే.. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌కు చెందిన పలువురు పెద్ద ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ముఖ్యంగా ఆ జట్టు వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్.

వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని వైస్ కెప్టెన్ బాధ్యతను షాదాబ్ ఖాన్ నుంచి తప్పించి స్టార్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిదికి అప్పగించవచ్చని సమాచారం తెలుస్తోంది. ఆసియా కప్‌లో షాదాబ్ అనుకున్నంత రానించకపోగా.. కేవలం 6 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. సూపర్-4లో భారత్, శ్రీలంకతో ఆడిన మ్యాచ్ లలో మెరుగైన ప్రదర్శన చూపించలేదు. దీంతో వన్డే ప్రపంచ కప్ లో ఆడుతాడో లేదో అన్నది అనుమానంగా ఉంది. అయితే అతని స్థానంలో అబ్రార్ అహ్మద్‌ను తీసుకునేందుకు సెలక్టర్లు చూస్తున్నారట. మరోవైపు ఆసియా కప్ నుండి నిష్క్రమించిన తర్వాత.. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది మధ్య డ్రెస్సింగ్ రూమ్‌లో వివాదం జరిగింది. మరీ ఈ క్రమంలో అఫ్రిదికి వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగిస్తే ఇంకా ఎలాంటి దుమారం చెలరేగుతుందో చూడాలి.

మరోవైపు పాకిస్తాన్ కీలక ఆటగాళ్లు ఫిట్‌నెస్‌ విషయంలోనూ ఇబ్బంది పడుతున్నారు. ఫాస్ట్ బౌలర్ నసీమ్ షా భుజం గాయం కారణంగా ప్రపంచకప్ మొత్తానికి దూరమయ్యాడు. అంతే కాకుండా.. హరీస్ రవూఫ్ ఫిట్‌నెస్‌పై అనుమానాలు ఉన్నాయి. ఇక అబ్రార్ అహ్మద్ గురించి మాట్లాడినట్లయితే.. అతను రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్. ఇప్పటివరకు పాకిస్తాన్ తరపున టెస్ట్ క్రికెట్‌లో మాత్రమే ఆడే అవకాశం వచ్చింది. అబ్రార్ 6 మ్యాచ్‌ల్లో 31.08 సగటుతో 38 వికెట్లు తీశాడు. అతని ప్రదర్శన పట్ల పాకిస్తాన్ జట్టు చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్-ఉల్-హక్ చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నాడు.