CM YS Jagan Inaugurates Handri Neeva Pump House at Kurnool: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేడు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో కర్నూలులోని లక్కసాగరం హంద్రీనీవా పంప్‌హౌస్‌ను సీఎం ప్రారంభించారు. దాంతో హంద్రీనీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ నుంచి తాగు, సాగునీటి సరఫరా ఆరంభం అయింది. హంద్రీనీవా పంప్‌హౌస్ నీటి ద్వారా డోన్, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాల్లో చెరువులకు జలకళ మొదలైంది. హంద్రీనీవా పథకం ద్వారా 10,394 ఎకరాలకు సాగు నీరు అందనుంది. రూ. 224 కోట్లతో ఈ పంప్‌హౌస్‌ను ప్రభుత్వం నిర్మించింది.
డోన్ బహిరంగ సభలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ… ‘రాయలసీమ నీటి కష్టాలు నాకు తెలుసు. ఈ ప్రాంత ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా సాగునీటి కోసం చర్యలు తీసుకున్నా. గతంలో డోన్‌లో ఒక్క ఎకరం కూడా ఇరిగేషన్‌లో లేదు. గత ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజల కష్టాలను అస్సలు పట్టించుకోలేదు. ఈరోజు ప్రారంభించిన ప్రాజెక్టు వల్ల డోన్, పత్తికొండ నియోజకవర్గాల్లో మేలు జరుగుతుంది రూ. 253 కోట్లతో ప్రాజెక్టును పూర్తి చేశాం. నీటి విలువ, సీమ కష్టాలు తెలిసిన ప్రభుత్వం మనది. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్టుల పూర్తికి చర్యలు తీసుకున్నాం’ అని అన్నారు.
‘హంద్రీనీవాను దివంగత నేత వైఎస్సార్ పూర్తి చేశారు. వెలుగొండ ప్రాజెక్టును వడివడిగా పూర్తి చేస్తున్నాం. రెండో టన్నెల్ పూర్తి చేసి అక్టోబర్‌లో ప్రారంభిస్తున్నాం. మహానేత వైఎస్సార్ బిడ్డ హయాంలో ప్రజలకు మంచి జరుగుతోంది. అబద్ధాలు, మోసాలను ప్రజలు ఏమాత్రం నమ్మవద్దు. ఈ ప్రభుత్వంలో మంచి జరిగిందా? లేదా? అన్నది ఆలోచించండి. ఇప్పుడు మీ బిడ్డ ఎందుకు ఇన్ని పనులు చేయగలుగుతున్నాడు.. నారా చంద్రబాబు హయాంలో ఎందుకు చేయలేదని అడుగుతున్నా. అప్పుడు ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్.. అప్పటికంటే అప్పులు తక్కవ చేశాం. చంద్రబాబుకు ప్రజలకు మంచి చేయాలని ఎప్పుడూ ఉండదు.బాబు మంచిని ఎప్పుడూ నమ్ముకోలేదు’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.