Leading News Portal in Telugu

Indigo: బీజేపీ నేత ఫిర్యాదుతో దిగి వచ్చిన ఇండిగో.. ఇకపై స్నాక్స్‌తో పాటు అది ఉచితం!


Indigo Decided to Provide Free Cool Drink With Snacks: విమాన ప్రయాణం అంటే ఇప్పటికి కూడా చాలా ఖరీదైనదే. కేవలం ఫ్లైట్ టికెట్ మాత్రమే కాదు.. అందులో స్నాక్స్ కొనాలంటే కూడా తడిసి మోపిడైపోతుంది. ఈ నేపథ్యంలోనే మాజీ ఎంపీ, బీజేపీ నేత చేసిన ఫిర్యాదుతో ఇండిగో విమానయాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. స్నాక్స్ తో పాటు కోక్ ను ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది.

వివరాల ప్రకారం బీజేపీ నేత, మాజీ ఎంపీ స్వపన్ దాస్‌గుప్తా ఇండిగో విమానంలో కూల్ డ్రింక్స్ అమ్మకంపై గతంలో  కేంద్రవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్యసింధియాకు ఫిర్యాదు చేశారు. విమానంలో ప్రయాణించే సమయంలో కూల్ డ్రింక్స్ కొనలేమని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలా అదనపు వసూళ్లతో ప్రయాణీకుల నుంచి డబ్బు గుంజడం సరికాదని అభిప్రాయపడ్డారు. విమానాల్లో కూల్ డ్రింక్స్ ను క్యాన్లలో అందించి అధిక మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నారని దీని వల్ల ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. గతంలో ఇండిగో మెనూలో జీడిపప్పు ధర రూ.200, కోక్ ధర రూ. 100 గా ఉండేది. అంటే మనం స్నాక్స్ తీసుకుంటే కూల్ డ్రింక్ కోసం అదనంగా రూ.100 చెల్లించాల్సి వచ్చేది. అంటే సాధారణంగా స్నాక్స్ కోసమే ఓ ప్రయాణీకుడు రూ. 300 వెచ్చించాల్సి వచ్చేది. దీని గురించే బీజేపీ నేత స్వపన్ దాస్ గుప్తా ఫిర్యాదు చేశారు.శీతల పానీయాల పేరిట దోచుకుంటున్నారని, బలవంతంగా ప్రయాణీకులతో స్నాక్స్ కొనిపిస్తున్నారని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని కోరారు. అదనపు దోపిడీని అరికట్టి ప్రయాణికులకు ఊరట కల్పించాలని సోషల్ మీడిడా వేదికగా విన్నవించారు. ఈ నేపథ్యంలోనే ఇండిగో సంస్థ దీనిపై స్పందించింది. ప్రస్తుతం ఉన్న తన మెనూను సవరించింది. దీంతో స్పందించిన ఇండిగో కూల్ డ్రింక్ ను క్యాన్స్ లో అందించబోమని స్నాక్స్‌తో పాటు కాంప్లిమెంటరీగా గ్లాసు జ్యూస్‌ను, కోక్‌ను ఉచితంగా అందిస్తామని ఓ ప్రకటనలో తెలిపింది. ఇది ప్రయాణీకులకు కొంత ఊరటనిచ్చే విషయం అని చెప్పవచ్చు.