Irfan Pathan React on Ravichandran Ashwin Return to Team India: వన్డే ప్రపంచకప్ 2023కి ముందు స్వదేశంలో ఆస్ట్రేలియాతో భారత్ వన్డే సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. ఆసీస్ వన్డే సిరీస్ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. అనూహ్యంగా భారత జట్టులోకి వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వచ్చాడు. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గాయపడటంతో అశ్విన్‌కు అవకాశం వచ్చింది. ఒకవేళ అక్షర్ మెగా టోర్నీకి అందుబాటులో లేకపోతే.. ప్రపంచకప్ 2023 జట్టులోకి అశ్విన్ వచ్చినా ఆశ్చర్యం లేదు. సెప్టెంబర్ 28 వరకు అన్ని జట్లు తమ 15 మంది ఆటగాళ్లలో మార్పులు చేసే అవకాశం ఉంది.
భారత సెలెక్టర్లు తీసుకున్న నిర్ణయంపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అసహనం వ్యక్తం చేశాడు. అశ్విన్ టాప్ స్పిన్నరే అయినా.. అతడిని ఎంపిక చేసిన విధానం సరిగ్గా లేదన్నాడు. ఇర్ఫాన్ పఠాన్ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ… ‘ప్రపంచంలో ఆర్ అశ్విన్ కంటే మెరుగైన స్పిన్నర్ లేడు. అయితే ప్రపంచకప్ వంటి పెద్ద టోర్నమెంట్లో విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఒక సీనియర్ ఆటగాడు వచ్చి మెగా టోర్నీలలో జట్టు కోసం బాగా ఆడతాడని ఆశించలేం. ఎందుకంటే అశ్విన్ 15-17 నెలల నుంచి వన్డేల్లో ఆడలేదు. అతడికి తగినంత మ్యాచ్‌లు ఆడే సమయం ఇస్తే బాగుండేది. ఆసీస్‌తో ఎంపిక చేసినా.. ఈ సమయం సరిపోతుందని నేను భావించడం లేదు’ అని అన్నాడు.
‘బీసీసీఐ సెలెక్షన్ కమిటీ వద్ద ఎలాంటి ప్రణాళికలు లేవు. ఆర్ అశ్విన్‌ను ప్రపంచకప్ 2023 కోసం ఎంపిక చేయాలని చూస్తున్నారు. యాష్ కోసం ఏదైనా ప్రణాళిక ఉండుంటే.. ప్రపంచకప్ ముందు అతడికి మరిన్ని అవకశాలు ఇవ్వాల్సింది. ఆస్ట్రేలియాతో ఆడినంత మాత్రన సరిపోతుందా?. 10 ఓవర్లు బౌలింగ్ చేయాలి. జట్టులో సర్దుకుపోయి పోవడమే కాకుండా ఫలితం భారత్‌కు అనుకూలంగా రావాలి. ఇదంతా అంత సులువేం కాదు. అందుకే ప్రణాళికలు ఇంకా మెరుగ్గా ఉంటే బాగుండేది’ అని ఇర్ఫాన్ ఇర్ఫాన్ చెప్పుకొచ్చాడు. ఆసీస్ సిరీస్ అక్టోబర్ 22 నుంచి ఆరంభం కానుండగా.. ప్రపంచకప్ 2023 అక్టోబర్ 5న ప్రారంభం కానుంది.