అసెంబ్లీ సమావేశాలు హాజరౌతాం.. తెలుగుదేశం | tdp mlas attend assembly| babu| arrest| protest| fight| people
posted on Sep 20, 2023 1:45PM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు అసెంబ్లీ సమావేశాలు గురువారం (సెప్టెంబర్ 21) నుంచి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాల ముందు సంప్రదాయంగా జరిగే కేబినెట్ భేటీ ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అసెంబ్లీ సమావేశాలు 27వ తేదీ వరకూ జరుగుతాయి. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ సహా పలు బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విద్యార్థులకు ఇంటర్ నేషనల్ బాక్యులరేట్ (ఐబీ) విద్యా విధానంపై కేబినెట్ చర్చించింది.
ఇవన్నీ పక్కన పెడితే చంద్రబాబు అరెస్టు, తదననంతర పరిణామాలపై కూడా కేబినెట్ లో చర్చ జరిగిందని అంటున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం అక్రమాలు, అవినీతిపై సభలో చర్చించాలని కేబినెట్ నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించింది. తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని అక్రమంగా అరెస్టు చేసిన తీరుపై సభలో గళమెత్తాలని నిర్ణయించింది. సభలో అధికార పార్టీ తమకు మైక్ ఇవ్వకపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ, మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, ఒక వేళ మైకు ఇచ్చినా మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా అధికార పార్టీ సభ్యులు సభలో గందరగోళం సృష్టించే అవకాశం ఉందనీ తెలుగుదేశం సభ్యులు భావిస్తున్నారు.
అయినా సరే పోరాటమే ఎజెండాగా అవమానాలు భరించడానికైనా సిద్ధ పడాలని తెలుగుదేశం శాసనసభా పక్షం నిర్ణయించింది. పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టు తదనంతర పరిస్థితుల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు హాజరవడంపై బుధవారం పార్టీలో చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా ప్రజా సమస్యలపై పార్టీ చేస్తున్న పోరాటంలో వెనక్కి తగ్గేది లేదని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎంతగా అవమానించినా ప్రజల కోసం భరిద్దామని పార్టీ ఎమ్మెల్యేలకు లోకేశ్ సూచించారు.
పోరాటమే అజెండాగా ప్రజల కోసం ఎన్ని అవమానాలైనా భరిద్దామని పేర్కొన్నారు. సభ వేదికగా చంద్రబాబు అక్రమ అరెస్టుపై గట్టిగా గళమెత్తాలని ఆయన పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును, జగన్ దుర్మార్గాలనూ ప్రజలలోకి బలంగా తీసుకువెళ్లేందుకు అసెంబ్లీని వేదికగా చేసుకోవాలని పేర్కొన్నారు. సభలో మైక్ ఇవ్వకుంటే నిరసన ద్వారా సాధిద్దామని చెప్పారు.