Leading News Portal in Telugu

Chandrababu Arrested: ఓవైపు తీర్పు.. మరోవైపు విచారణ.. చంద్రబాబు కేసులో ఉత్కంఠ..!


Chandrababu Arrested: ఆంధ్రప్రదేశ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో అరెస్ట్‌ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తోంది.. విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంతో పాటు హైకోర్టులోనూ చంద్రబాబు కేసుల విచారణ సాగుతోంది. ఇక, బుధవారం రోజు చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై విచారణ కొనసాగగా.. ఈ రోజు తీర్పు వెలువడనుంది.. ఈ రోజు ఉదయం 11 గంటల తర్వాత తీర్పు వెలువరించనుంది ఏసీబీ కోర్టు.. నిన్న కస్టడీ పిటిషన్ పై సీఐడీ, చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనలు పూర్తి అయ్యాయి.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో లోతైన విచారణ కోసం చంద్రబాబును 5 రోజుల కస్టడీ కోరంది సీఐడీ.. వాదనలు ముగియడంతో.. తీర్పు ఇవాళ్టికి వాయిదా పడింది.. అయితే, తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మరోవైపు.. చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై నేడు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో విచారణ సాగనుంది.. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ నమోదు చేసిన కేసులో ఏ1గా ఉన్నారు చంద్రబాబు.. ఇప్పటికే IRR కేసులో ఐటీ వారెంట్ ఏసీబీ కోర్టులో దాఖలు చేసింది సీఐడీ.. అయితే, ఈ కేసులో నేడు విచారణ చేపట్టనుంది హైకోర్టు.. ఇక.. చంద్రబాబు పీటీ వారెంట్లపై నేడు ఏసీబీ కోర్టు విచారణ చేపట్టనుంది.. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసుతో పాటు ఫైబర్ నెట్ కేసుల్లో పీటీ వారెంట్లను సీఐడీ దాఖలు చేయగా.. నిన్నే పీటీ వారెంట్ల మీద విచారణ జరపాలని సీఐడీ కోరగా ఏసీబీ కోర్టు నిరాకరించింది.. అయితే, నేడు చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై తీర్పు తర్వాత పీటీ వారెంట్‌పై విచారణ చేపట్టనుంది ఏసీబీ కోర్టు.