Leading News Portal in Telugu

Asian Games 2023: ఆసియా గేమ్స్‌ సెమీస్‌ చేరిన భారత జట్టు!


Indian womens Cricket Team Entered Semi Finals of Asian Games 2023: చైనాలోని హాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌ 2023 సెమీస్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు అడుగుపెట్టింది. గురువారం భారత్‌-మలేషియా జట్ల మధ్య జరగాల్సిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో భారత్ సెమీస్‌ చేరింది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో.. ఇరు జట్లకు చెరో పాయింట్‌ దక్కింది. అయితే మలేషియా కంటే భారత ర్యాంక్‌ (టాప్‌ సీడ్‌) మెరుగ్గా ఉండడంతో.. స్మృతీ మంధాన సేన సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. సెప్టెంబర్‌ 24న సెమీఫైనల్‌ 1లో పాకిస్తాన్‌తో భారత్ తలపడే అవకాశం ఉంది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన మలేషియా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 15 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 173 స్కోరు చేసింది. భారత బ్యాటర్లలో షఫాలీ వర్మ (67), జెమిమా రోడ్రిగ్స్‌ (47 నాటౌట్), స్మృతీ మంధాన (27), రిచా ఘోష్ (21 నాటౌట్) రాణించారు. మలేషియా బౌలర్లు ఇజ్జతీ ఇస్మాయిల్, మాస్‌ ఎలీసా చెరో వికెట్‌ పడగొట్టారు. భారత్ ఇన్నింగ్స్ సమయంలో వర్షం పడడంతో అంపైర్‌లు మ్యాచ్‌ను నిలిపివేశారు. వర్షం తగ్గుముఖం పట్టాక మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించారు.

అనంతరం మలేషియా ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే మళ్లీ వర్షం పడింది. మలేషియా ఇన్నింగ్స్‌లో కేవలం రెండు బంతులు మాత్రమే పడ్డాయి. వర్షం ఎంతకీ తగ్గుముఖం పట్టకపోవడంతో.. అంపైర్‌లు మ్యాచ్‌ను రద్దు చేశారు. టాప్‌ సీడ్‌తో ఆసియా గేమ్స్‌ బరిలోకి దిగిన భారత్‌.. వర్షం వల్ల ఈ మ్యాచ్‌ రద్దైనా సెమీస్‌కు చేరింది. ఇక ఆదివారం జరగనున్న తొలి సెమీస్‌లో భారత్ గెలిస్తే పతకం ఖాయం అవుతుంది. భారత పురుషుల జట్టు తొలిసారి ఆసియా గేమ్స్‌లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. పురుషుల క్రికెట్‌ మ్యాచ్‌లు సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభమవుతాయి.