అమరావతిలో టీడీఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అనే అంశంపై రేపటి సభలోనూ పట్టు పట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఇవాళ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు, స్పీకర్ తమ్మినేని కామెంట్లపై సమావేశంలో చర్చించారు. సభలో టీడీపీ సభ్యులను యూజ్ లెస్ ఫెలోస్ అనడం.. వైసీపీని మన వాళ్లంటూ స్పీకర్ సంబోధించడంపై టీడీఎల్పీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
నిష్పాక్షపతంగా ఉండాల్సిన స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని టీడీఎల్పీ అభిప్రాయపడింది. రేపు సభలో స్పీకర్ ఏకపక్ష తీరును ప్రస్తావించాలని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. మరోవైపు సభలో వైసీపీ నేతల తీరు చూస్తుంటే భౌతిక దాడులకు దిగే సూచనలు కన్పిస్తున్నాయని పలువురు నేతలు తెలిపారు. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ, వైసీపీ సభ్యులు ఎంత దుందుడుకుగా వ్యవహరించినా వెనక్కు తగ్గేదే లేదంటున్నారు. స్కిల్ అంశంపై రేపు సభలో వైసీపీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే.. తమకూ అవకాశమివ్వాలని టీడీపీ కోరనుంది. దీనికి స్పీకర్ పర్మిషన్ ఇవ్వకుంటే.. బయట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు టీడీపీ సభ్యులు సిద్దమవుతున్నారు. అంతేకాకుండా.. శాసన మండలిలోనూ ఇదే అంశంపై పట్టు పట్టనున్నారు టీడీపీ.
మరోవైపు ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ ఒకరోజు సస్పెండ్ చేశారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ వాయిదా తీర్మానం ఇచ్చిన టీడీపీ సభ్యులు.. చర్చకు పట్టుబట్టడం, స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టడం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో కాసేపు సభను వాయిదా వేశారు. అనంతరం ప్రారంభం తర్వాత కూడా టీడీపీ సభ్యులు మళ్లీ ఆందోళనకు దిగారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.