Leading News Portal in Telugu

Vinod Kumar : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు యదాతథంగా జరుగుతాయి


మోడీ నాటకానికి తెరపడిందని, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు యదాతథంగా జరుగుతాయన్నారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్. ఇవాళ ఆయన హనుమకొండ జిల్లాలో మాట్లాడుతూ.. పార్లమెంటులో ప్రవేశపెట్టిన మహిళా బిల్లు ప్లాప్ అయ్యిందని, 2039 ఎన్నికల్లో డీలిమిటేషన్ జరుగుతుందన్నారు. రిజర్వేషన్లు ఆ తర్వాతే అమలవుతాయని, ప్రధాని మోడీ మహిళల్లో ఆశలురేపి వాటిపై నీళ్లు చల్లారన్నారు. రాజ్యాంగ సవరణ చేస్తేనే డీలిమిటేషన్ జరిగి ఐదేళ్లలోపు రిజర్వేషన్లు అమలు జరగొచ్చని, 2027వరకూ డీలిమిటేషన్ ప్రక్రియ జరగదన్నారు. మహిళా బిల్లుతో మోడీని నమ్మేవాళ్లను కూడా పచ్చిమోసం చేశారని, పార్లమెంటులో ఉత్కంఠ పరిస్థితి తీసుకురావడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదన్నారు వినోద్‌ కుమార్‌.

అంతేకాకుండా.. మహిళలకు అసెంబ్లీలో, లోకసభలో మాత్రమే 33 శాతం రిజర్వేషన్ అని పొందుపరిచారని, మహిళా బిల్లుపై మోడీకి చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగ సవరణ చేసి బిల్లును ఆమోదించాలన్నారు. పోస్టల్ వ్యవస్థనే తొలగించాలని కేంద్ర ప్రభుత్వం చూసిందని, ప్రైవేటీకరణ ముసుగులో పోస్టల్ వ్యవస్థను నిర్వీర్యం చేయాలని చూశారని ఆయన ఆరోపించారు. పోస్టల్ కార్మికుల హక్కుల కోసం నేను ఎంపీగా ఉన్నప్పుడు కొట్లాడానని, అందుకే పోస్టల్ ఉద్యోగులను తొలగించకుండా కాపాడుకోగలిగామన్నారు. కానీ వారి సమస్యలు అలాగే ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఆలిండియా గ్రామీణ తపాలా ఉద్యోగుల జాతీయ మహాసభలు ఇక్కడ జరగడం సంతోషకరమని ఆయన అన్నారు.