Leading News Portal in Telugu

TV news channels: ఉగ్రవాదులకు వేదిక కావద్దు.. మీడియా ఛానెళ్లకు కేంద్రం వార్నింగ్..


TV news channels: ఉగ్రవాదులకు వేదికగా మారొద్దని కేంద్రం ప్రైవేట్ టీవీ ఛానెళ్లకు వార్నింగ్ ఇచ్చింది. కెనడా, ఇండియాల మధ్య దౌత్యపరమైన వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వ శాఖ గురువారం కోరింది. ఉగ్రవాదంతో సంబంధం ఉన్న వ్యక్తులను ఇంటర్వ్యూ చేయడం మానుకోవానలి సూచించింది.

భారతదేశంలో చట్టం ద్వారా నిషేధించబడిన సంస్థకు చెందిన ఉగ్రవాదంతో సంబంధం ఉన్న, తీవ్ర నేర కేసులు ఉన్న విదేశాలకు చెందిన వ్యక్తిని ఓ టెలివిజన్ ఛానెల్ ఇంటర్వ్యూకు ఆహ్వానించినట్లు కేంద్రం దృష్టికి రావడంతో ఈ సూచనలను జారీ చేసింది. దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, దేశ భద్రత, విదేశాలతో భారతదేశ సంబంధాలకు హాని కలిగిచే పలు వ్యాఖ్యలు చేశాడని కేంద్రం పేర్కొంది. దేశంలో ఇది పబ్లిక్ ఆర్డర్ కి భంగం కలిగించే అవకాశం ఉందని I&B మంత్రిత్వ శాఖ సలహాగా చెప్పింది.

ప్రభుత్వం మీడియా స్వేచ్ఛను సమర్థిస్తుందని, రాజ్యాంగం ప్రకారం దాని హక్కుల్ని గౌరవిస్తుందని, టీవీ ఛానెళ్లు ప్రసారం చేసే కంటెంట్ సెక్షన్ 20లోని సబ్ సెక్షన్(2)తో సహా సీటీఎన్ చట్టం-1995లోని నిబంధనలకు కట్టుబడి ఉండాలని అని పేర్కొంది. ఉగ్రవాదంతో సంబంధం ఉన్న వ్యక్తులు, సంస్థలకు చెందిన వ్యక్తులకు చెందిన రిపోర్టులను, అభిప్రాయాలు, ఎజెండాలకు టీవీ ఛానెళ్లలో చోటు ఇవ్వద్దని తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2), సీటీఎన్ చట్టంలోని పరిమితులకు కట్టుబడి ఉండాలని తెలిపింది.

ఇండియా, కెనడాల మధ్య ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య చిచ్చు పెట్టింది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అక్కడి పార్లమెంట్ లో మాట్లాడుతూ.. ఈ హత్యలో భారత్ ప్రమేయం ఉందని ఆరోపించారు. కెనడా సీనియర్ భారతీయ దౌత్యవేత్తను బహిష్కరించింది. దీనికి బదులుగా భారత్ కూడా కెనిడియన్ దౌత్యవేత్తను బహిష్కరించింది. కెనడావి అసంబద్ధ, రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలుగా భారత్ ఖండించింది. కెనడా ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని భారత విదేశాంగశాఖ తీవ్రంగా వ్యాఖ్యానించింది.