Nandamuri Balakrishna: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.. ఓ దశలో టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.. అసెంబ్లీ వేదికగా టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ మీసాలు మిలేయడం, తొడగట్టడం లాంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి.. ఆ తర్వాత టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారు స్పీకర్.. ఇక, మీడియాతో మాట్లాడిన నందమూరి బాలకృష్ణ.. అంబటి రాంబాబు సభలో మీసం మేలేసి తొడ కొట్టాడు.. నా వృత్తిని అవమానించాడు. సినిమాల్లో చూసుకోమన్నాడు.. అంబటి నన్ను రెచ్చగొట్టాడు అంటూ ఫైర్ అయ్యారు బాలయ్య.. రా చూసుకుందామని అంబటి అన్నాడు.. నేనూ రా చూసుకుందామన్నాను.. సినిమా ఇండస్ట్రీలో నాలాగా ధైర్యంగా భయపడకుండా మాట్లాడే వారు కొందరే ఉంటారని.. మిగిలిన వారిలాగా నేనూ సైలెంటుగా ఉంటానని అనుకున్నారు.. నేను ముందుకొచ్చేసరికి బిత్తరపోయారని వ్యాఖ్యానించారు నందమూరి బాలకృష్ణ.
రాష్ట్రంలో నియంతృత్వ పరిపాలన జరుగుతోందని విమర్శించారు బాలయ్య.. సంక్షేమం-అభివృద్ధి చేసింది ఎన్టీఆర్, చంద్రబాబేనన్న ఆయన.. చంద్రబాబు అంటే అభివృద్ధికి ఓ బ్రాండ్.. చంద్రబాబు లాంటి వ్యక్తి మీద స్కిల్ కేసులో తప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరం అన్నారు. సీఎం జగన్ తీరేంటో ఎవ్వరికీ అర్థం కావడం లేదని.. కక్ష సాధింపు తప్ప.. సీఎం జగన్ అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదన్నారు. ఏ చట్ట ప్రకారం చంద్రబాబు అరెస్ట్ జరిగిందోనని ప్రభుత్వం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారని.. అభివృద్ధి – సంక్షేమం చేసిన చంద్రబాబుని అరెస్ట్ చేస్తారా..? అని అందరూ చర్చించుకుంటున్నారని వెల్లడించారు. స్కిల్ కేసులో నిజంగానే అవినీతి జరిగి ఉంటే ఛార్జ్ షీట్ ఎందుకు దాఖలు చేయలేదు? అని నిలదీశారు బాలయ్య.. స్కిల్ కేసులో షెల్ కంపెనిలే లేవని తెలిపారు.
జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నాడు.. టీడీపీ ఇలాంటివెన్నో చూచిందన్నారు బాలకృష్ణ.. జైల్లో చంద్రబాబు ధైర్యంగానే ఉన్నారు.. కానీ, రాష్ట్రం గురించి బాధపడుతున్నారని తెలిపారు. ఇక, వైజాగ్‌కు జూనియర్ ఆర్టిస్టులను తెచ్చి వైసీపీ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఎద్దేవా చేశారు. ఇవాళ అసెంబ్లీలో చంద్రబాబు కేసును విత్ డ్రా చేసుకోవాలని మేం రిక్వెస్ట్ చేశాం.. చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని కోరాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అసెంబ్లీలో కోరామని తెలిపారు.. ఓ అబద్దాన్ని వంద సార్లు చెబితే నిజమవుతుందనే భ్రమలో వైసీపీ ఉందని మండిపడ్డారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనం కూడా రోడ్ల మీదకు వస్తారని హెచ్చరించారు. గంజాయితో యువకులను నిర్వీర్యం చేసేస్తున్నారు.. రోమ్ తగులపడితే చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్నట్టుగా ఉంది జగన్ తీరు అంటూ దుయ్యబట్టారు నందమూరి బాలకృష్ణ.