Leading News Portal in Telugu

Minister KTR : లబ్ధిదారుల జాబితాలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు కూడా ఉన్నారు


కుత్బుల్లాపూర్, దుండిగల్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ, ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి కే. తారకరామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ హైదరాబాద్ నగరంలో కట్టిన లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విలువ 9700 వేల కోట్ల పైననే అన్నారు. కానీ మేము కట్టిన ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మార్కెట్ విలువ 50 నుంచి 60 వేల కోట్ల రూపాయలు ఉంటుందన్నారు మంత్రి కేటీఆర్‌. ఒక్క రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఎవరి ప్రమేయం లేకుండా లబ్ధిదారులకు ఉచితంగా అందిస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్‌. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికను అత్యంత పారదర్శకంగా కంప్యూటర్ ప్రోగ్రామ్ ఆధారంగా పూర్తి చేయడం జరుగుతున్నదని, లబ్ధిదారుల ఎంపికలు ప్రజాప్రతినిధుల పాత్ర లేదు. పేదలకి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందితే చాలు అన్న కెసిఆర్ గారి మార్గదర్శనం మేరకు పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు మంత్రి కేటీఆర్‌. లబ్ధిదారుల జాబితాలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు కూడా ఉన్నారని, ఈరోజు 8 చోట్ల 13 వేలకు పైగా ఇండ్లను ఒక్కరోజే లబ్ధిదారులకు అందిస్తున్నామన్నారు కేటీఆర్.

అంతేకాకుండా.. ‘ఈరోజు జరిగిన ఇండ్ల పంపిణీ కార్యక్రమంతో దాదాపు 30 వేల ఇండ్లు లబ్ధిదారులకు అందించడం జరిగింది. మిగిలిన 70 వేల ఇళ్లను కూడా త్వరలో లబ్ధిదారులకు అందిస్తాం. ఒక్క లబ్ధిదారుడైన ఒక్క రూపాయి లంచం ఇచ్చే పరిస్థితి ఉంటే నేరుగా అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ చెప్పాలి. భారతదేశంలో ఇంకా ఎక్కడైనా ఇంత పెద్ద పక్క డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టి పేదలకు ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందా. పేదలకు ఉచితంగా ఇండ్లు కట్టించి ఇస్తున్న బిజెపి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో అయినా ఉన్నదా. దేశంలోనే అతిపెద్ద మురికివాడల అభివృద్ధి కార్యక్రమంగా ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం నిలుస్తుంది. ఇంత పెద్ద డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్న జిహెచ్ఎంసి అధికారులకు అభినందనలు. కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే పేదలకు న్యాయం జరుగుతున్నది. వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. పేదల పైన, రైతుల పైన కెసిఆర్ కన్నా అత్యంత ప్రేమ కలిగిన నాయకుడు దేశంలో ఎవరూ లేరు. పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ప్రజలను కోరుతున్నాను. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందించలేని కొన్ని పార్టీలు ఈరోజు అడ్డగోలు వాగ్దానాలు చేస్తున్నాయి. ఢిల్లీ నుంచి, బెంగళూరు నుంచి వచ్చి అడ్డగోలు వాగ్దానాలు చేస్తున్న వారి మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. సంక్రాంతికి ముందు గంగిరెద్దులు వచ్చినట్లు ఎన్నికల ముందు వచ్చి బూటకపు హామీలు ఇచ్చే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి.’ అని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.