Leading News Portal in Telugu

Vizianagaram: కలెక్టరేట్ లో పాము కలకలం.. పరుగులు తీసిన జనం


Snake Enters Vizianagaram Collector Office: ఈ మధ్య కాలంలో వన్య ప్రాణులు అడవిని వదిలి జనావాసాలలోకి వచ్చి ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. జంతువులే అనుకుంటే ప్రమాదకరమైన పెద్ద పెద్ద కొండ నాగులు, తాచుపాములు,  కట్లపాములు, కొండ చిలువలు కూడా జనావాసాల్లోకి వచ్చి కలకలం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా కొండల ప్రాంతాల్లో , ఏజెన్సీ ప్రాంతాల్లో తరుచుగా ఇలా జరగుతూ ఉంటుంది. ప్రస్తుతం వాన కాలం కావడంతో వాతావరణం తడిగా, తేమగా ఉండటంతో పురుగు, పుట్ర విపరీతంగా ఉంటుంది. వాటిని తినే క్రమంలో పాములాంటి విష సర్పాలు జనావాసాల్లోకి వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే విజయనగరం కలెక్టరేట్ లోకి ప్రవేశించింది. దీంతో అక్కడ కలకలం రేగింది. భయంతో జనం పరుగులు తీశారు.

ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సమీపంలోకి వచ్చిన నాగుపాము అందరిని బెదరగొట్టింది. గతంలో కూడా విజయనగరం కలెక్టరేట్ లోకి ఓ భారీ పాము ప్రవేశించింది.   డీఈఓ ఆఫీస్ వద్ద ప్రత్యక్షమై కలకలం రేపింది. అయితే అక్కడి వారు స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇవ్వడంతో అతను వచ్చి పామును బంధించడంతో అంతా ఊపరి పీల్చుకున్నారు. ఇప్పుడు మళ్లీ పాము వచ్చి భయపెట్టింది. ఇలా ఎప్పుడు పడితే అప్పడు, ఎక్కడ పడితే అక్కడ పాములు కనిపించడంతో ప్రజలు భయపడిపోతున్నారు. కలెక్టర్ ఆఫీసుకు రావాలంటేనే వణికి పోతున్నారు. ఇలాంటి విష సర్పాలు రాకుండా ఇకపై గట్టి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వీటి కారణంగా మనుషుల ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.