Leading News Portal in Telugu

Ganesh Festival: వినాయకుడికి రూ.1.51 కోట్ల నోట్లతో అలంకరణ.. అద్భుతం


Ganesh Festival: ఆది పూజలు అందుకునే గణనాథుడిపై కొంత మంది భక్తులు వినూత్న రీతిలో తమ భక్తిని చాటుకుంటారు. ఎన్టీఆర్‌ జిల్లాలోని నందిగామలో కోటి 51 లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో స్వామి వారికి ప్రత్యేకంగా అలంకరణ చేశారు. వాసవి మార్కెట్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక అలంకరణ అందరినీ ఆకట్టుకుంటోంది. నందిగామ పట్టణంలోని వాసవి మార్కెట్‌లో అరుదైన వినాయకుని విగ్రహం ప్రత్యేక ఆకర్షణను సంతరించుకుంది. ఉత్సవ కమిటీ సభ్యులు స్వామి వారి అలంకరణకు కావలసిన నగదును సేకరించి వినాయక మండపాన్ని అలంకరించారు. 41 ఏళ్ల నుంచి వీళ్లు ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. అలంకరణ కోసం ఉపయోగించే కరెన్సీ నోట్ల విలువ ఏటా అంతకంతకూ పెరుగుతోంది. ఈ గణపతిని దర్శించుకునే భక్తుల సంఖ్య కూడా అలాగే పెరుగుతోంది.

ఈ మండపాన్ని రూ. 2వేలు, 500, 200, 100, 50 కొత్త కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఈ కరెన్సీ వినాయకుడిని వీక్షించడానికి నందిగామ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు క్యూ కడుతున్నారు. రాత్రింబవళ్లు గణేష్ ఉత్సవ కమిటీ అతి కష్టంతో ఈ కరెన్సీ వినాయకుడిని తయారు చేశారు.