భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. అక్టోబర్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించాల్సి ఉండగా.. అంతకు ముందే.. అనగా.. సెప్టెంబర్ 30వ తారీఖున ఆయన తెలంగాణకు వస్తున్నారు. మహబూబ్ నగర్ లో బీజేపీ నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. అయితే, ఈ నెల 30వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ పాలమూరు జిల్లాలో నిర్వహించే బహిరంగ సభకు హాజరుకానున్నారు. ప్రధాని మోడీ సభను 2023 ఎన్నికల శంఖారావం సభగా బీజేపీ రాష్ట్ర నేతలు అంటున్నారు. బహిరంగ సభను చాలా ప్రతిష్టాత్మకంగా బీజేపీ నాయకులు తీసుకున్నారు. ఈ బహిరంగ సభకు కనీసం లక్ష మందిని తరలించేలా జన సమీకరణపై దృష్టిపెట్టారు.
ఇక, బీజేపీ బహిరంగ సభ ఏర్పాట్లను పార్టీ రాష్ట్ర నేతలు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, తల్లోజు ఆచారి పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ శ్రేణులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీని గ్రామాల్లోకి తీసుకువెళ్లి.. మరీ ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీరును, కాంగ్రెస్ గ్యారెంటీలపై విమర్శలు గుప్పిస్తూ.. ప్రజల్లో బీజేపీ అవగాహన కల్పిస్తుంది.